​​​​నాదే తప్పు..నిజం తెలుసుకోలేకపోయా: మమత

తాజా వార్తలు

Updated : 21/03/2021 17:13 IST

​​​​నాదే తప్పు..నిజం తెలుసుకోలేకపోయా: మమత

సువేందు అధికారి కుటుంబంపై దీదీ విసుర్లు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి సువేందు అధికారి కుటుంబంపై విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లు ఆ కుటుంబ నిజస్వరూపం తెలుసుకోలేకపోయానని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంతి దక్షిణ్‌ ప్రాంతంలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. ఆ కుటుంబం రూ.5వేల కోట్లతో ఒక సామ్రాజ్యం నిర్మించుకుందన్న ఊహాగానాలు తనకూ వినిపించాయని, మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ అంశంపై విచారణ జరిపిస్తానని చెప్పారు. అధికారి కుటుంబాన్ని ద్రోహులుగా అభివర్ణించారు. 

‘‘ఈ విషయంలో నాదే తప్పు. ఈ విషయంలో నేనో పెద్ద గాడిదను. వారి నిజస్వరూపం తెలుసుకోలేకపోయా. వారు రూ.5000 కోట్లతో పెద్ద సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారని ప్రజలు చెప్పుకుంటారు. ఆ డబ్బుతో ఎన్నికల్లో ఓటర్లను కొనబోతున్నారు. అలాంటి వారికి ఓటేయకండి’’ అని ఓటర్లకు మమత విజ్ఞప్తి చేశారు. అధికారి కుటుంబం ఈ ప్రాంతాన్ని జమిందారుల్లా పాలిస్తున్నారని, ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకునే విషయంలో తనకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వైద్యం, రోడ్లు వంటివి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినవే తప్ప అధికారి కుటుంబం చేసినవి కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం శాంతి సామరస్యాలతో, అభివృద్ధి బాటలో పయనించాలంటే భాజపాను రాష్ట్రానికి దూరంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా ‘వందే మాతరం’, ‘జైహింద్‌’ అంటూ మమత నినదించారు.

భాజపాలోకి సువేందు తండ్రి...

తృణమూల్‌ను వీడి భాజపాలో చేరిన సువేందు అధికారి తండ్రి, తృణమూల్‌ ఎంపీ శిశిర్‌ అధికారి కూడా ఆదివారం కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో ఆయన భాజపాలో చేరారు. తృణమూల్‌ కోసం తాము ఎంతో చేశామన్నారు. తనతో పాటు తన కుమారుల పట్ల ఆ పార్టీ వ్యవహరించిన తీరు నచ్చక పార్టీ మారినట్లు చెప్పారు. మోదీ, అమిత్‌షా నేతృత్వంలో పనిచేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ‘జై శ్రీరామ్‌’, ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినదించారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ నందిగ్రామ్‌లో మమతపై తన కుమారుడు సువేందు సునాయాసంగా గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తంచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని