ఈ ముఖ్యమంత్రులు.. ఓడిన సారథులు
close

తాజా వార్తలు

Published : 03/05/2021 11:50 IST

ఈ ముఖ్యమంత్రులు.. ఓడిన సారథులు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తూ బెంగాల్‌లో వరుసగా మూడో సారి అఖండ విజయాన్ని సాధించిన మమతా బెనర్జీ.. నందిగ్రామ్‌లో మాత్రం ఓటమి చవిచూడాల్సి వచ్చింది. నందిగ్రామ్‌లో గెలుపు అంత సులువు కాదని తెలిసినా.. పార్టీ కోసం అక్కడి నుంచి బరిలోకి దిగారు. తానోడినా తృణమూల్‌ను గెలిపించారు. అయితే, సిట్టింగ్‌ ముఖ్యమంత్రి ఎన్నికల్లో పరాజయం పొందడం ఇదే తొలిసారి కాదు. గతంలో హరియాణా, గోవా సీఎంలు కూడా ఎన్నికలు ఓటమిపాలయ్యారు. 

హరీశ్‌ రావత్‌

హరీశ్‌ రావత్‌.. రెండు చోట్లా

2017లో ఉత్తరాఖండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత హరీశ్‌ రావత్‌ ఓడిపోయారు. ఒకటి కాదు.. పోటీ చేసిన రెండు చోట్లా ఆయనకు విజయం దక్కలేదు. హరిద్వార్‌(రూరల్‌)లో 12వేల ఓట్ల తేడాతో, కిచ్చా నియోజకవర్గంలో రెండు వేల తేడాతో భాజపా అభ్యర్థుల చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో హస్తం పార్టీని ఓడించి భాజపా అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే.

లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌

గోవా సీఎం కూడా..

అదే ఏడాది గోవా రాష్ట్రంలోనూ శాసనసభ ఎన్నికలు జరిగాయి. అక్కడ సిట్టింగ్‌ ముఖ్యమంత్రి, భాజపా నేత లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ను గెలుపు వరించలేదు. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై 7వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో భాజపాకు 13, కాంగ్రెస్‌కు 17 సీట్లు వచ్చాయి. హస్తం పార్టీ అతిపెద్ద మెజార్టీ కలిగిన పార్టీగా అవతరించినప్పటికీ.. మిత్ర పక్షాలతో కలిసి భాజపా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌కు మరోసారి అవకాశం ఇవ్వని కాషాయ పార్టీ.. నాడు కేంద్ర రక్షణ మంత్రిగాఉన్న మనోహర్‌ పారికర్‌ను సీఎంను చేసింది. 

రఘుబర్‌దాస్‌

ఝార్ఖండ్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు..

ఝార్ఖండ్‌ రాష్ట్రంలో ఇద్దరు సిట్టింగ్‌ ముఖ్యమంత్రులు ఓటమి చవిచూశారు. 2008లో ఝార్ఖండ్‌లో ఏ పార్టీకీ మెజార్టీ రాలేదు. దీంతో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీ కింగ్‌ మేకర్‌గా మారింది. భాజపా, జేడీయూతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా శిబు సోరేన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఎక్కడా పోటీ చేయకపోవడంతో ఆరునెలల్లో తమార్‌ నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహించారు. అందులో శిబు సోరేన్‌  గెలుపు సాధించలేదు. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. 

ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, భాజపా నేత రఘుబర్‌ దాస్‌ కూడా ఓటమి చవిచూశారు. జంషెద్‌పూర్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సరయూ రాయ్‌కి భాజపా టికెట్‌ నిరాకరించింది. దీంతో పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన ఆయన.. ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ నియోజకర్గమైన జంషెద్‌పూర్‌ తూర్పు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమేగాక.. 12వేల ఓట్ల తేడాతో సీఎంను ఓడించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని