
తాజా వార్తలు
నేను..బెంగాల్ ఆడపులిని..! మమతా
భాజపా దాడులకు తలవంచే ప్రసక్తే లేదు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
కోల్కతా: భారతీయ జనతా పార్టీ తమపై చేస్తోన్న దాడులకు భయపడి తలవంచబోనని.. నేను బెంగాల్ ఆడపులినని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూచ్ బెహర్లో పర్యటించిన దీదీ, ఎన్నికల సమయంలో భాజపా చేస్తోన్న బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు.
‘అస్సాం నుంచి భాజపా గూండాలను రప్పిస్తోంది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు వారు(భాజపా) బాంబులతో దాడులు జరుపుతారు. అలాంటి వాటికి భయపడవద్దు. తల్లులు, చెల్లెళ్లు ఓటు హక్కు వినియోగించుకోవడం వారికి ఇష్టం ఉండదు. అందుకే ఓటు వేయకుండా కేంద్ర బలగాలతో అడ్డుకుంటున్నారు’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భాజపా విమర్శలు గుప్పించారు. డబ్బు బలంతో భాజపా నన్నేమీ చేయలేదని..నేను బెంగాల్ ఆడపులిని అని గర్జించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కూచ్బెహర్లో పర్యటించిన దీదీ, ఒక వేళ భాజపా అధికారంలోకి వస్తే అస్సాంలో మాదిరిగానే బెంగాల్లోనూ నిర్బంధ క్యాంపులు ఏర్పాటు చేస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే అక్కడ 14లక్షల బెంగాలీలను నిర్బంధ క్యాంపుల్లో ఉంచారని..అలాంటి పేదవారి కోసం తాను పోరాడుతున్నానని వివరించారు. మన రాష్ట్రం గుజరాత్ వారి చేతుల్లోకి పోకుండా ఉండాలంటే తృణమూల్ కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లుకు మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
ఇదిలాఉంటే, ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో మూడు దశల్లో 91 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది. మరో ఐదు దశల్లో అక్కడ ఎన్నికలు జరుగనున్నాయి.