నందిగ్రామ్‌లో దీదీ × సువేందు?

తాజా వార్తలు

Updated : 21/01/2021 12:54 IST

నందిగ్రామ్‌లో దీదీ × సువేందు?

బెంగాల్‌లో హాట్‌ సీట్‌ కానుందా..!

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యంగా నందిగ్రామ్‌ నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారుతోంది. రాబోయే ఎన్నికల్లో తాను నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి భాజపాకు సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. దీంతో దీదీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కీలక నేత సువేందు అధికారిని ఈ స్థానం నుంచే బరిలోకి దించాలని భాజపా భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఇటీవలే తృణమూల్‌ను వీడి భాజపాలో చేరిన సువేందు అధికారి కుటుంబానికి నందిగ్రామ్‌, జంగల్‌మహల్‌ ప్రాంతాల్లో గట్టి పట్టుంది.  భాజపాలో చేరకముందు వరకు ఆయన నందిగ్రామ్‌కు ప్రాతినిధ్యం వహించారు. పార్టీ మారడంతో ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సువేందు భాజపాలోకి వెళ్లడంతో నందిగ్రామ్‌, జంగల్‌మహల్లో తృణమూల్‌ బలం కోల్పోయినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో ఇటీవల నందిగ్రామ్‌లో పర్యటించిన దీదీ.. వచ్చే ఎన్నికల్లో తాను ఈ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. భవానీపూర్‌తో పాటు నందిగ్రామ్‌ నుంచి కూడా బరిలోకి దిగుతానన్నారు. దీదీ సవాల్‌తో ఆలోచనలో పడిన భాజపా.. ఆమెకు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సీఎంకు ప్రత్యర్థిగా సువేందునే రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల బెంగాల్‌ భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.

నేను సిద్ధమే..: సువేందు

మరోవైపు నందిగ్రామ్‌ నుంచి మళ్లీ బరిలోకి దిగేందుకు తాను సిద్ధమేనని సువేందు అధికారి కూడా ప్రకటించారు. ఒకవేళ పార్టీ నన్ను నిలబెడితే.. మమతాబెనర్జీని 50వేల ఓట్లతో ఓడిస్తానని, విజయం సాధించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ధైర్యముంటే భవానీపూర్‌ కాకుండా ఒక్క నందిగ్రామ్‌ నుంచే పోటీ చేయండంటూ దీదీకి సవాల్‌ విసిరారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో సువేందు అధికారిని భాజపా సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. అదే జరిగితే సీఎం అభ్యర్థుల పోరుతో నందిగ్రామ్‌ నియోజకవర్గం ఉత్కంఠగా మారనుంది.

పదేళ్ల క్రితం బెంగాల్‌లో అధికారం లెఫ్ట్‌ పార్టీల నుంచి తృణమూల్‌ చేతికి రావడంలో నందిగ్రామ్‌ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. మరి అలాంటి కీలక స్థానం నుంచి దీదీ పోటీ చేస్తారా? ఒకవేళ చేస్తే విజయం సాధించగలరా? సీఎంగా హ్యాట్రిక్ కొట్టగలరా? అనేది తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే..!

ఇవీ చదవండి..

రాహుల్‌.. నాటి నిజాల్ని ఒప్పుకోగలరా?

కొద్దిమంది గుత్తాధిపత్యంలోకి దేశం!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని