‘జగన్‌ గారూ... ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి’

తాజా వార్తలు

Updated : 15/07/2021 19:00 IST

‘జగన్‌ గారూ... ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి’

మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌

అమరావతి: తెలుగు అకాడమీని తెలుగు- సంస్కృత అకాడమీగా మార్పు చేయడాన్ని యావత్‌ తెలుగు జాతి వ్యతిరేకిస్తుందని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు.  తెలుగు-సంస్కృత అకాడమీ అధ్యక్షులు, అధికార భాషా సంఘం అధ్యక్షులు మినహా ఈ నిర్ణయాన్ని సమర్థించేవారు ఎవరూ లేరని తెలిపారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు.

‘‘తెలుగు అకాడమీ పేరు మార్పుపై అన్ని రాజకీయ పార్టీలు నిరసన తెలిపాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేశారు. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజాభిప్రాయం గమనించడానికి ఇంతకంటే వేరే మార్గం ఏముంది. తమ మాటను ఇతరులు ఆలకించాలని కోరేవారు, ఇతరుల మాటలు తాము ఆలకించాలన్నది ప్రజాస్వామ్య మూలసూత్రం. అలా వ్యవహరించకపోతే  నిరంకుశ, నియంతృత్వ పాలన అవుతుందే తప్ప.. ప్రజాస్వామ్య పాలన అనిపించుకోదు. ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ నిర్ణయాలకు ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉంటే వెనక్కి తీసుకుంటాయి. దాని వలన ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుంది. తెలుగు-సంస్కృత అకాడమీ విషయంలో ప్రజాభిప్రాయాన్ని గమనంలోకి తీసుకుని పునఃపరిశీలన చేయాల్సిన అవసరముంది. తెలుగు జాతి ఆత్మాభిమాన అంశంగా అందరూ భావిస్తున్నారు. తెలుగు భాషాభివృద్ధికి 50 ఏళ్ల క్రితం ఏర్పడిన మొట్టమొదటి సంస్థ తెలుగు అకాడమీ. దానిని యథాతథంగా కొనసాగించి, నిధులిచ్చి పటిష్ఠంగా పనిచేసేలా చేయాలని ప్రజాభిప్రాయం వ్యక్తమైంది. విభజన ప్రక్రియ కూడా పూర్తి చేయించి మనకు రావాల్సిన దాదాపు రూ.200 కోట్లు రప్పించే విధంగా చర్యలు చేపట్టాలి. సంస్కృత భాషను ఎవరూ వ్యతిరేకించడం లేదు. సంస్కృతానికి ప్రత్యేక అకాడమీ ఏర్పాటు చేయండి’’ అని బుద్ధప్రసాద్‌ సీఎంకు రాసిన లేఖలో విజ్ఞప్తి  చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని