
తాజా వార్తలు
తెరాసను ప్రజలు ప్రశ్నించాలి: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: భారతీయ జనతాపార్టీకి హైదరాబాద్ నగరంతో విడదీయలేని అనుబంధం ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. ప్రచారానికి తక్కువ సమయం ఉన్నా సద్వినియోగం చేసుకుంటామన్నారు. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల హామీ ఏమైందని తెరాసను ప్రశ్నించారు.
‘‘గత ఎన్నికలకు ముందు సనత్‌నగర్ ఐడీహెచ్ కాలనీలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. బస్తీల్లోని ప్రజలను వాహనాల్లో తరలించి ఐడీహెచ్ ఇళ్లను చూపించారు. ఐడీహెచ్ ఇళ్లను చూసి ప్రజలంతా భ్రమపడ్డారు. ఇళ్లు ఇస్తారనే నమ్మకంతో ప్రజలంతా తెరాసకు మూకుమ్మడిగా ఓటేశారు. పేద ప్రజలను భ్రమల్లో ఉంచి ఓట్లు దండుకున్నారు. ఐదేళ్లు పూర్తయినా పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేకపోయారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని తెరాసను ప్రజలు ప్రశ్నించాలి. పాతబస్తీని ఇస్తాంబుల్, కొత్త నగరాన్ని డల్లాస్‌గా మారుస్తామన్నారు ఏమైంది. రోడ్లపై గుంత చూపిస్తే రూ.వెయ్యి ఇస్తామన్నారు. భాగ్యనగరంలో రోడ్లన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయి. రూ.67వేల కోట్లతో అభివృద్ధి చేశామంటున్నారు.. కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేరా?. నగరంలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయారు. హైదరాబాద్‌కు అనేక హామీలు ఇచ్చి విస్మరించారు. హైదరాబాద్ సముద్రంగా మారడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం. నగరంలో సుమారు 6లక్షల ఇళ్లలోకి నీరు చేరింది. వరదల కారణంగా 40మంది అమాయక ప్రజలు చనిపోయారు’’ అని కిషన్‌రెడ్డి వివరించారు.