ఏపీతో నీకేం పని అంటున్నారు: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 12/03/2021 16:08 IST

ఏపీతో నీకేం పని అంటున్నారు: కేటీఆర్‌

హైదరాబాద్: తెలంగాణలోని ఉద్యోగులు, న్యాయవాదులతో తెరాసది పేగుబంధం అని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్‌లో తెలంగాణ ఐకాస సమితి సదస్సులో కేటీఆర్‌ పాల్గొన్నారు. ‘తెలంగాణ జీవితం-సామరస్య విలువలు’ అనే అంశంపై సదస్సులో చర్చించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగుల సంక్షేమం కోసం తెరాస పాటుపడుతోందన్నారు. అభివృద్ధిలో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో 35వేల మందికి పదోన్నతులు కల్పించినట్లు పేర్కొన్నారు. న్యాయవాదుల కోసం రూ.100 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామని తెలిపారు. అక్రిడేషన్లు ఎక్కువగా ఇచ్చిన రాష్ట్రం తెలంగాణనే అని వెల్లడించారు.

45 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే పోటీలో ఉండబోమని కాంగ్రెస్‌ చెప్పిందని.. అయితే ఆ పార్టీ అసలు పోటీలోనే లేకుండా పోయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రావాలని రామచందర్‌రావు సవాల్‌ విసిరారని.. అయితే భాజపా నాయకులు వాట్సాప్‌ వర్సిటీలో చదువుకున్నారని చురకలంటించారు. తెలంగాణ వచ్చాక వీసీల నియామకం చేపట్టామని.. ఆరేళ్లలో 50 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై శ్వేత పత్రం విడుదల చేసిన తర్వాత ప్రతిపక్షాల విమర్శలు తగ్గిపోయాయన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ దేశంలో లేదా?

‘‘విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారు. నీవెవరు అడిగేందుకు? ఏపీతో నీకేం పని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ దేశంలో లేదా? మేం మాట్లాడకూడదా?80వేల మంది బీఎస్‌ఎన్ఎల్‌ ఉద్యోగులను రోడ్డుపై పడేసింది. దేశంలో మాకు భాగస్వామ్యం లేదా?ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్ముతున్నారు. రేపు సింగరేణి, బీహెచ్‌ఈఎల్‌పై కూడా పడతారు. ఏపీకి కష్టం వచ్చింది కదా.. మాకేంటి సంబంధం అని మేం నోరు మెదపకుండా ఉంటే ఎలా? రేపు మాకు కష్టం వస్తే ఎవరు ఉంటారు?ఎవరికో కష్టం వచ్చింది.. నాకెందుకులే అనుకుంటే సరికాదు. మొదట భారతీయులం.. తర్వాతే తెలంగాణ బిడ్డలం. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఖండించాలి. 2003లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను మోదీ విమర్శించారు. సిలిండర్‌కు దండం పెట్టి ఓటేయాలని అన్నారు. ఇప్పుడు ఎవరికి మొక్కి ఓటేయాలి. భాజపాకు ఓటేస్తే ధరల పెరుగుదలకు ఆమోదం తెలిపినట్లే అవుతుంది. భాజపా జాతీయవాదంలో తెలంగాణ ప్రయోజనాలు లేవా? రాష్ట్రంపై వివక్ష చూపుతున్న పార్టీకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి?’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని