సీఎం పనితీరుకు నిదర్శనమే సాగర్‌ గెలుపు
close

తాజా వార్తలు

Updated : 02/05/2021 16:34 IST

సీఎం పనితీరుకు నిదర్శనమే సాగర్‌ గెలుపు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు నిదర్శనమే నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఫలితమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తెరాస గెలుపొందిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌తో కలిసి తలసాని మీడియాతో మాట్లాడారు. విపక్షాలు చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మలేదని.. ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారన్నారు. మినీ పురపోరులోనూ సాగర్ తరహా ఫలితాలే వస్తాయని తలసాని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి గెలిస్తే భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ ప్రచారం చేసినా ప్రజలు ఆయన్ను ఇంటికే పంపించారని ఎద్దేవా చేశారు. ఇకనైనా భాజపా నేతలు ఆచితూచి మాట్లాడాలన్నారు. ప్రతిపక్షాలు తెరాస నేతలపై వ్యక్తిగత దూషణలు మానుకోవాలని హితవు పలికారు. సాగర్‌లో విజయం సాధించేందుకు ఎంతో శ్రమించిన పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలకు ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

హామీలను కచ్చితంగా నేరవేరుస్తాం: బాల్క సుమన్‌

నాగార్జునసాగర్ ప్రజలు తెరాసపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ తెలిపారు. ఎన్నికల్లో తామిచ్చిన హామీలను కచ్చితంగా నేరవేరుస్తామన్నారు. సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులపైన విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నమ్మరని అన్నారు. ఇప్పటికైనా భాజపా నేతలు విమర్శలు మాని.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటికోసం పోరాడాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు కూడా తెరాసపై అనేక ఆరోపణలు చేశారన్నారు. సాగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధే జానారెడ్డిని ఓడించిందని వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని