ఆంధ్రా నాయకులు ఏం సమాధానం చెబుతారు?
close

తాజా వార్తలు

Published : 25/06/2021 01:14 IST

ఆంధ్రా నాయకులు ఏం సమాధానం చెబుతారు?

 తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వానికి ఆదేశించిందన్నారు. డీపీఆర్‌ లేకుండా ప్రాజెక్టును కట్టవద్దని బోర్డు స్పష్టంగా చెప్పిందన్నారు. బోర్డు ఆదేశాలతో ఈ ప్రాజెక్టు అక్రమమని తేలిపోయిందని.. దీనిపై ఆంధ్ర ప్రాంత నాయకులు ఏం సమాధానం చెబుతారని మంత్రి ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతలను కట్టొద్దని హరిత ట్రైబ్యునల్ చెప్పిందని పేర్కొన్నారు. కృష్ణా బోర్డు ఆదేశాల ప్రకారం నిబంధనలకు లోబడి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపేయాలని ఏపీ సర్కార్‌ను డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన వారంలోనే కృష్ణా బోర్డును ఆశ్రయించామని.. గతేడాది జులై 25న మరోసారి బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత కేంద్రం, కృష్ణా బోర్డుకు ఏడు లేఖలు రాసినట్లు చెప్పారు.

కాంగ్రెస్‌ ఎందుకు పోరాడదు?

‘‘ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం నాలుగు రేట్లు పెంచింది కాంగ్రెస్‌ హయాంలో కాదా? వైఎస్సార్‌ సీమకు నీళ్లు తీసుకెళ్తుంటే డీకే అరుణ హారతి పట్టారు. ఏపీ ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ ఎందుకు పోరాడదు?మల్లన్నసాగర్‌పై కోర్టులకు వెళ్లే కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలి. ఈ విషయంలో కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఏపీ ప్రాజెక్టులపై రాష్ట్ర భాజపా నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?’’ అని మంత్రి ప్రశ్నించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని