
తాజా వార్తలు
మార్పు వైపు బెంగాల్ చూపు..! మోదీ
హుగ్లీ: పశ్చిమబెంగాల్ ప్రజల ఉత్సాహాం, శక్తిని చూస్తుంటే రాష్ట్రం మార్పు కోరుకుంటోందన్న విషయం స్పష్టమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదే సందేశం కోల్‌కతా నుంచి దిల్లీకి తాకుతోందని అభిప్రాయపడిన మోదీ, రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం రాజ్యమేలుతోందని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సంస్కృతి, సంప్రదాయాలను అవమానపరచడాన్ని బెంగాల్ ప్రజలు ఎన్నటికీ క్షమించరని మమతా సర్కార్‌పై ధ్వజమెత్తారు. పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. హుగ్లీ జిల్లాలో ఏర్పాటుచేసిన భాజపా ప్రచార కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.
కేంద్ర పథకాల నిధులను రాష్ట్ర ప్రజలకు అందకుండా మమతా సర్కార్ అడ్డుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ‘పేదలకు, రైతులకు లబ్ధి చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకే నిధులను విడుదల చేస్తోంది. సిండికేట్‌గా మారిన కొందరు తృణమూల్ నేతల అనుమతి లేకుండా ఇవి పేదలకు చేరడం లేదు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు ధనికులుగా, సాధారణ పౌరులు పేదలుగా మారిపోతున్నారు’ అని ప్రధానమంత్రి టీఎంసీ నేతలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో దోపిడి, అవినీతి రాజ్యమేలుతుందన్న మోదీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగావకాశాల రాష్ట్రంగా మారుస్తానని ఎన్నికల సభలో పశ్చిమ బెంగాల్ ప్రజలకు మోదీ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో చాలా కుటుంబాలు రక్షిత మంచినీటికి దూరంగా ఉన్నాయని.. కేంద్ర ప్రభుత్వం పథకం ఉన్నప్పటికీ దీదీ ప్రభుత్వం సద్వినియోగ పరచుకోవడం లేదని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ ప్రభుత్వానికి దేశభక్తి లేదని, ఎందరో మహనీయులను నిర్లక్ష్యం చేసిందన్నారు. హుగ్లీ ప్రాంతంలో అభివృద్ధిపై దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేశారని.. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో గ్యాస్, రైల్వే ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.