నా హెలికాఫ్టర్‌లో సమస్య వచ్చింది.. కుట్ర అన్నానా?

తాజా వార్తలు

Updated : 15/03/2021 16:56 IST

నా హెలికాఫ్టర్‌లో సమస్య వచ్చింది.. కుట్ర అన్నానా?

మమతా బెనర్జీ తీరుపై అమిత్‌ షా విమర్శనాస్త్రాలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సోమవారం హోంమంత్రి అమిత్‌ షా బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇటీవల నందిగ్రామ్‌ ఘటన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు.  ఈ రోజు తన హెలికాప్టర్‌లో సమస్య తలెత్తిందని, కానీ దాన్ని కుట్రగా పేర్కొనలేదంటూ కౌంటర్‌ ఇచ్చారు. రాణిబంద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో షా మాట్లాడుతూ.. ‘‘హెలికాఫ్టర్‌లో చిన్న సమస్య తలెత్తడంతో ఈ రోజు నాకు ఆలస్యమైంది. కానీ దాన్ని నేను కుట్రగా పేర్కొనడం లేదు. ఇటీవల మమతా జీ కాలికి గాయమైంది. ఆమె ఎలా గాయపడ్డారో తెలియదు. తృణమూల్‌ కాంగ్రెస్‌ దీన్నొక కుట్ర అంటోంది.  కానీ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రమాదవశాత్తూ జరిగిందని స్పష్టంచేస్తోంది. గాయమైన కాలితో చక్రాల కుర్చీలో తిరుగుతున్న దీదీని ఒకటే ప్రశ్న అడగదలచుకున్నా..  మీ ప్రభుత్వ హయాంలో హత్యకు గురైన 130మంది భాజపా కార్యకర్తల కుటుంబాల బాధ మీకు తెలుసా?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘాన్ని అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. మమతకు గాయపడిన ఘటనపై స్పందించిన అమిత్‌ షా.. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా,  కానీ.. రాజకీయ హింసలో ప్రాణాలు కోల్పోయిన తమ పార్టీ కార్యకర్తల గురించి కూడా ఆమె ఆలోచిస్తే బాగుంటుందన్నారు.  

‘‘అమ్మ, మట్టి, మనుషులు అనే నినాదం వినిపించిన తృణమూల్‌ కాంగ్రెస్‌కు గతంలో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. రాజకీయ హింసకు ముగింపు పలుకుతారనుకున్నారు. కానీ అంతా రివర్స్‌లో జరిగింది. రాష్ట్రంలో హింస, అవినీతి పెరిగిపోయాయి. గిరిజనులు ఒక ధ్రువీకరణ పత్రం కోసం రూ.100లు చెల్లించాల్సి వస్తోంది. భాజపాను అధికారంలోకి తీసుకొస్తే సర్టిఫికేట్‌ల కోసం గిరిజనులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. 49 అటవీ ఉత్పత్తులను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తాం. ఇది గిరిజనులకు ఆర్థికంగా తోడ్పాటునందిస్తుంది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ రాష్ట్రానికి రూ.993 కోట్లు ఇచ్చింది. కానీ తృణమూల్‌ ప్రభుత్వం కేవలం రూ.121 కోట్లు మాత్రమే వినియోగించింది’’ అని అమిత్‌ షా ఆరోపించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని