పార్టీని చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది: సోనియా

తాజా వార్తలు

Published : 10/05/2021 15:29 IST

పార్టీని చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది: సోనియా

ఇటీవలి ఎన్నికల్లో పార్టీ పరాభవంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు

దిల్లీ: ఇటీవల ముగిసిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సాధించిన ఫలితాలపై ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పరాభవానికి గల కారణాలను గుర్తించి వెంటనే ‘ఇంటిని చక్కబెట్టాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈరోజు జరిగిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఎన్నికలు జరిగిన అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలను ఆయా రాష్ట్రాల్లోని సీనియర్‌ నాయకులు పార్టీకి వివరించాలని సోనియా ఆదేశించారు. మన లోపాలేంటో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో అంచనాలను ఎందుకు అందుకోలేకపోయామో వివరించాలన్నారు. పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులను వాస్తవిక కోణంలో గుర్తించేందుకు ఓ చిన్న స్థాయి కమిటీని నియమించాలనుకుంటున్నట్లు సోనియా తెలిపారు.

పార్టీ అంతర్గత ఎన్నికల అంశాన్నీ సోనియా ఈ సందర్భంగా లేవనెత్తారు. నూతన అధ్యక్షుడికి సంబంధించిన అంతర్గత ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన హెడ్యూల్‌ను సమావేశం ముగిసే సరికి వెల్లడిస్తామని తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాభవానికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి సోనియా అధ్యక్షపదవిలో తాత్కాలికంగా ఆ పదవిలో కొనసాగుతున్నారు.

ఇక పార్టీ దుస్థితిని గుర్తుచేస్తూ గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, శశిథరూర్‌, కపిల్‌ సిబల్‌ అధిష్ఠానానికి గత ఏడాది లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీని సమూలంగా ప్రక్షాళించాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించగలిగే కొత్త అధ్యక్షుణ్ని వెంటనే ఎన్నుకోవాల్సిన అసవరం ఉందని పేర్కొన్నారు. ఈ లేఖ పార్టీలో కొంత విభేదాలకు దారితీసిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని