ఆ తోక పార్టీకి ఓటేయకండి: మమత

తాజా వార్తలు

Published : 25/03/2021 15:53 IST

ఆ తోక పార్టీకి ఓటేయకండి: మమత

కోల్‌కతా: మైనార్టీల ఓట్లను చీల్చేందుకు రాష్ట్రంలో కొత్త పార్టీ ఒకటి పుట్టుకొచ్చిందని, దాని వెనుక భాజపా హస్తం ఉందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ పార్టీకి భాజపా నుంచి డబ్బులు కూడా అందుతున్నాయని విమర్శించారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార సభలో ఈ మేరకు ఆమె మాట్లాడారు. పేరు ప్రస్తావించనప్పటికీ పరోక్షంగా ఇస్లాం ప్రబోధకుడు అబ్బాస్‌ సిద్ధిఖీ స్థాపించిన ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్ఎఫ్‌)ను ఉద్దేశించి పరోక్షంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో లెఫ్ట్‌- కాంగ్రెస్‌ కూటమితో కలిసి ఆ పార్టీ పోటీ చేస్తోంది.

‘‘భాజపా తరఫున రాష్ట్రంలో ఓ కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. మైనారిటీల ఓట్లను చీల్చి కాషాయ పార్టీకి లబ్ధి చేకూర్చాలని చూస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయొద్దు’’ అని ఓటర్లను మమత అభ్యర్థించారు. సీపీఎం- కాంగ్రెస్‌ సైతం భాజపాతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు.  రాష్ట్రంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలును అడ్డుకోవడం కేవలం తృణమూల్‌ ద్వారానే సాధ్యమని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర సర్కారుపై నేరుగా విమర్శలు గుప్పించారు. అంఫన్‌ తుపాను వల్ల రాష్ట్రానికి ₹లక్ష కోట్ల మేర నష్టం వాటిల్లితే రూ.1000 కోట్లు మాత్రమే ప్రధాని ప్రకటించారని గుర్తుచేశారు. భాజపాకు  రాష్ట్రంలో 75 సీట్లు కూడా రావడం కష్టమేనని మమత అన్నారు. అమిత్‌షా సూచన మేరకే నంబర్‌ను మీడియా సంస్థలు  ఎక్కువ చేసి చూపిస్తున్నాయని సర్వేలనుద్దేశించి వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని