Politics: 2019 ఎన్నికల సీన్‌ రిపీట్‌ అయ్యేనా?
close

తాజా వార్తలు

Published : 22/06/2021 18:07 IST

Politics: 2019 ఎన్నికల సీన్‌ రిపీట్‌ అయ్యేనా?

పట్నా: ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌తోపాటు ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గాన్ని విస్తరించేందుకు అధికార భాజపా కసరత్తులు మొదలు పెట్టింది. ఇప్పటికే పలుమార్లు పార్టీ కీలక నేతలంతా సమావేశమై దీనిపై చర్చిస్తున్నారు. మరోవైపు మిత్రపక్ష పార్టీలకు కూడా తగినంత ప్రాధాన్యం ఇస్తూ ముందుకు పోవాలని కాషాయ దళం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌లో జేడీయూకు స్థానం దక్కుతుందా? ఒకవేళ దక్కినా గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీ అధినేత నీతీశ్‌కుమార్‌ అందుకు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నా ఎలాంటి షరతులు పెడతారన్నదానిపై సందిగ్ధత  నెలకొంది.

జేడీయూ కీలక నేతల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ  అంశంపై అధికార భాజపాతో ఎలాంటి చర్చలు జరగలేదని తెలుస్తోంది. ఒకవేళ మంత్రి వర్గ విస్తరణ జరిగితే  జేడీయూకు కచ్చితంగా స్థానం ఉంటుందని ఆ పార్టీ ఎంపీ ఆర్‌సీపీ సింగ్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన జేడీయూ అధ్యక్షుడు నీతీశ్‌కుమార్‌కు అత్యంత సన్నిహితుడు. అయితే జేడీయూకు  ఎన్ని మంత్రి పదవులు ఇస్తారన్నది ముఖ్యమంత్రి నీతీశ్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు జేడీయూకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని భాజపా ప్రతిపాదించింది. అయితే దీనికి నీతీశ్‌ ససేమిరా అన్నారు. ఇస్తే రెండు ఇవ్వాలి.. లేదంటే పూర్తిగా వద్దని పట్టుబట్టారు.  దీంతో బిహార్‌ భాజపా ఇన్‌ఛార్జ్‌ భూపేంద్రయాదవ్‌ ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ‘టోకెన్‌ రెప్రజెంటేషన్‌’ పద్ధతి ప్రకారం ఒక్క మంత్రి పదవి మాత్రమే సాధ్యమవుతుందని తెగేసి చెప్పారు. అప్పటి నుంచి  కేంద్ర మంత్రి వర్గానికి  జేడీయూ దూరంగా ఉంటోంది. 

తాజా పరిస్థితుల నేపథ్యంలో  మిత్రపక్ష పార్టీలకు సాంత్వన చేకూర్చే నిర్ణయాలు తీసుకునే యోచనలో భాజపా అగ్రనాయకత్వం ఉంది. ఈ క్రమంలో జేడీయూకి రెండు కేంద్ర మంత్రి పదవులు ఇస్తారంటే నీతీశ్‌ ఒప్పుకుంటారా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. కనీసం 5 మంత్రి పదవులు అడగాలన్న యోచనలో జేడీయూ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రెండు పదవులే ఇచ్చినట్లయితే జేడీయూ నుంచి ఆర్‌సీపీ సింగ్‌, లలన్‌ సింగ్‌ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. ఈ విషయంలో జేడీయూ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎన్ని మంత్రిపదవులిచ్చేందుకు భాజపా ఆసక్తి చూపిస్తుందో తెలుసుకున్న తర్వాతే ముఖ్యమంత్రి తన  నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని