టికెట్‌ వివాదం: ఎంపీ స్వపన్‌దాస్‌ రాజీనామా 
close

తాజా వార్తలు

Published : 16/03/2021 14:59 IST

టికెట్‌ వివాదం: ఎంపీ స్వపన్‌దాస్‌ రాజీనామా 

దిల్లీ: ప్రముఖ కాలమిస్టు, నామినేట్‌ ఎంపీ స్వపన్‌ దాస్‌గుప్తా రాజ్యసభలో తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేడు రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు.

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భాజపా ఇటీవల అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో తారకేశ్వర్‌ నియోజకవర్గం నుంచి ఎంపీ స్వపన్‌దాస్‌ గుప్తాను నిలబెట్టింది. అయితే దీనిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. నామినేటెడ్‌ ఎంపీలు రాజకీయ పార్టీల్లో చేరకూడదని పేర్కొంది. ‘‘పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో స్వపన్‌ దాస్‌గుప్తా భాజపా అభ్యర్థిగా ఉన్నారు. రాజ్యసభకు నామినేట్‌ అయిన సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే వారిని అనర్హులుగా ప్రకటించాలని రాజ్యాంగంలోని 10 షెడ్యూల్‌ చెబుతోంది. ఆయన 2016 ఏప్రిల్‌లో రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేశారు. ఆ సమయంలో భాజపాలో చేరినట్లు ఆయన ప్రకటించలేదు. ఇప్పుడు ఆయన భాజపాలో చేరినందుకుగానూ ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందే’’ అని తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా నిన్న ట్వీట్‌ చేశారు. అటు కాంగ్రెస్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.

ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో స్వపన్‌ దాస్‌గుప్తా నేడు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం లేదా శుక్రవారం ఆయన తన నామినేషన్‌ సమర్పించే అవకాశముంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని