రాజీనామా చేసే ప్రసక్తే లేదు: యడియూరప్ప

తాజా వార్తలు

Updated : 17/07/2021 12:59 IST

రాజీనామా చేసే ప్రసక్తే లేదు: యడియూరప్ప

నాయకత్వ మార్పు వార్తలను ఖండించిన కర్ణాటక సీఎం

దిల్లీ: కర్ణాటకలో నాయకత్వ మార్పు జరగనుందంటూ వస్తున్న వార్తలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, భాజపా నేత యడియూరప్ప ఖండించారు. రాజీనామాపై వస్తున్న ఊహాగానాల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. కర్ణాటకలో ప్రాజెక్టులు, పార్టీ బలోపేతంపై చర్చించేందుకే తాను దిల్లీ వచ్చినట్లు చెప్పారు.

యడియూరప్ప, ఆయన కుమారుడు విజేయంద్ర శుక్రవారం ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నారు. సాయంత్రం వీరిద్దరూ ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులను కలిశారు. దీంతో కర్ణాటకలో సీఎం మార్పు జరుగుతుందనే ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. దీనిపై నేడు విలేకరులు యడియూరప్పను ప్రశ్నించగా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంపై చర్చించేందుకే తాను దిల్లీ వచ్చానని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షాను కలిశానన్నారు. మేకెదాటు ప్రాజెక్టు గురించి కేంద్రమంత్రులతో చర్చించానని, ఈ ప్రాజెక్టు నిర్మించి తీరుతామన్నారు.

ఇక భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి గురించి చర్చించానని తెలిపారు. ‘‘ఆయనకు(నడ్డా) నాపై మంచి అభిప్రాయం ఉంది. నేను పార్టీ కోసం పనిచేస్తున్నా. రాష్ట్రంలో మరోసారి భాజపాను అధికారంలోకి తీసుకొస్తాం’’ అని చెప్పుకొచ్చారు.

భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు అరుణ్‌ సింగ్‌ ఇటీవల కర్ణాటకలో పర్యటించారు. పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలతోనూ భేటీ అయ్యారు. ఈ క్రమంలో సీఎంపై వ్యతిరేకత వ్యక్తమైనట్లు సమాచారం. ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో సీఎం తనయుడి జోక్యం ఎక్కువైపోతోందని, ఫలితంగా ప్రభుత్వ పనితీరుపై ప్రభావం పడుతోందని ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ప్రచారం జోరందుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని