విశాఖ‌లో పల్లా సోదరుడి నిర్మాణాలు కూల్చివేత

తాజా వార్తలు

Updated : 13/06/2021 13:38 IST

విశాఖ‌లో పల్లా సోదరుడి నిర్మాణాలు కూల్చివేత

క‌బ్జా చేశార‌ని మంత్రి అవంతి ఆరోప‌ణ‌లు

న్యాయస్థానంలో పోరాడతాన‌న్న ప‌ల్లా శంక‌ర‌రావు

విశాఖ‌: విశాఖ‌లో కూల్చివేత‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. విశాఖ జిల్లా గాజువాక ఆటోన‌గ‌ర్ స‌మీపంలో మాజీ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు సోద‌రుడు ప‌ల్లా శంక‌ర‌రావు ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించి నిర్మాణాలు చేప‌ట్టారంటూ జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు వాటిని కూల్చివేశారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు చెందిన ఆస్తులే ల‌క్ష్యంగా కూల్చివేతలు సాగుతున్నాయని ప‌లువురు నేత‌లు ఆరోపిస్తున్నారు. ఆక్ర‌మ‌ణ‌లోని భూములు ప‌లువురి ఆధీనంలో ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. తుంగ్లాంలో 12.5 ఎక‌రాలు, జ‌గ్గ‌రాజుపేట‌లో 5 ఎక‌రాలు స్వాధీనం చేసుకున్నారు.
న్యాయ‌స్థానంలో పోరాడ‌తా: ప‌ల్లా శంక‌ర‌రావు

తుంగ్లాంలో తాను ఆక్ర‌మించాన‌ని అధికారులు చెబుతున్న భూమిని 1992లో 56 మంది రైతుల ద‌గ్గ‌ర కొనుగోలు చేశాన‌ని ప‌ల్లా శంక‌ర‌రావు తెలిపారు. త‌న భార్య సోద‌రుడు సంజ‌య్ ప‌రశురామ్ పేరు మీద కొనుగోలు చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ముంద‌స్తు నోటీసులు ఇవ్వ‌కుండా రెవెన్యూ సిబ్బంది రాత్రి రెండు గంట‌ల స‌మ‌యంలో కూల్చివేయ‌డం దారుణ‌మ‌న్నారు. త‌న సోద‌రుడిని వైకాపా లోకి రావాలని ఆహ్వానించినా వెళ్ల‌క‌పోయేస‌రికి అధికార పార్టీ నాయ‌కులు కావాల‌నే ఇబ్బందులు పెడుతున్నార‌ని శంక‌రరావు ఆరోపించారు. న్యాయ‌స్థానంలో పోరాడి త‌న భూమిని ద‌క్కించుకుంటాన‌ని.. అధికార పార్టీకి గుణ‌పాఠం చెబుతామన్నారు. 

రూ.కోట్ల ఆస్తులు క‌బ్జా చేశారు: మంత్రి అవంతి

విశాఖ భూక‌బ్జాలో ఎంతటి వారున్నా వారిపై క్రిమిన‌ల్ కేసులు పెట్టి అరెస్టు చేయాల‌ని మంత్రి అవంతి శ్రీ‌నివాస్ అధికారులను కోరారు. ప‌ల్లా శంక‌ర‌రావు రూ. కోట్ల విలువైన ఆస్తుల‌ను క‌బ్జా చేశారని ఆరోపించారు. విశాఖ‌ను ప‌రిపాల‌నా రాజ‌ధానిగా చేయ‌డానికి తెదేపా అనుకూల‌మా? కాదా? తేల్చి చెప్పాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని