Revant: రేవంత్‌ ఇంటి వద్ద భారీగా పోలీసులు.. దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ మూసివేత

తాజా వార్తలు

Updated : 02/10/2021 16:22 IST

Revant: రేవంత్‌ ఇంటి వద్ద భారీగా పోలీసులు.. దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ మూసివేత

హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇంటి వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌సైరన్‌’ ర్యాలీకి ఆయన వెళ్లకుండా అడ్డుకొనేందుకు జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసం వద్ద పోలీస్‌ బలగాలు మోహరించాయి. రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఈ ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దిల్‌సుఖ్‌నగర్‌- ఎల్బీనగర్‌ రూట్‌లో ఈ ర్యాలీకి అనుమతి లేదని, ట్రాఫిక్‌ జాం అవుతుందని పోలీసులు తెలిపారు. ర్యాలీ నిర్వహించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అయితే, ఈ ర్యాలీ ఎలాగైనా చేపట్టితీరుమతాని రేవంత్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ శ్రేణులు సాయంత్రం 4గంటల కల్లా దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకోవాలని, లాఠీఛార్జికి భయపడాల్సిన అవసరం లేదని రేవంత్‌ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ శ్రేణులు దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకొనేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో రేవంత్‌ అక్కడికివెళ్లకుండా అడ్డుకొనేందుకు దాదాపు 100 మందికి పైగా పోలీసులు ఆయన నివాసం వద్ద మోహరించారు. అయితే, 4గంటలకు అంతా ఒకేసారి రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉండటంతో దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు పోలీసులు మోహరించారు. అలాగే, కాంగ్రెస్‌ శ్రేణులు ప్రగతిభవన్‌ వైపు వెళ్లే అవకాశం కూడా ఉండటంతో ఆ పరిసరాల్లోనూ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినట్టు సమాచారం. 

దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ మూసివేత

మరోవైపు, దిల్‌సుఖ్‌నగర్‌ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ దుకాణాలను మూసివేయిస్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ను అధికారులు మూసివేశారు.

పలువురు ముఖ్య నేతల నిర్బంధం

ఈ ర్యాలీ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్‌ ముఖ్య నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద ములుగు ఎమ్మెల్యే సీతక్కను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని గృహనిర్బంధం చేశారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో పలువురు కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ సహా కొందరు నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని