దుబ్బాక ఫలితంపై ఎవరేమన్నారంటే..?

తాజా వార్తలు

Published : 11/11/2020 01:38 IST

దుబ్బాక ఫలితంపై ఎవరేమన్నారంటే..?

హైదరాబాద్‌: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్య విజయం సాధించింది. తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతపై ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. ఉత్కంఠ పోరులో విజయం సాధించడంతో రఘునందన్‌రావుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రఘునందన్‌ రావు విజయం.. తెరాస పతనానికి నాంది కాబోతోందని భాజపా నేతలు పేర్కొంటుండగా.. తెరాస అప్రజాస్వామిక విధానాలే భాజపాకు విజయాన్ని కట్టబెట్టాయని సీపీఐ నేత నారాయణ అన్నారు.

దుబ్బాకలో భాజపా గెలుపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన మలుపు. తెరాస పతనానికి దుబ్బాకలో భాజపా గెలుపు నాంది కాబోతుంది. రఘునందన్ రావుకు హృదయపూర్వక అభినందనలు.

-కె.లక్ష్మణ్‌, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు 

అధికార పార్టీ కుట్రలను ఛేదించి భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. తెరాస కుటుంబ పాలనకు భాజపానే ప్రత్యామ్నాయమని ఈ ఎన్నికలు నిరూపించాయి.

-రామ్‌ మాధవ్‌, భాజపా సీనియర్‌ నేత

దుబ్బాకలో విజయం సాధించిన రఘునందన్‌రావుకు, భాజపా తెలంగాణ నాయకత్వానికి అభినందనలు. భాజపా నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ విజయం నిదర్శనం. బండి సంజయ్‌ నాయకత్వ పటిమ ఆ పార్టీ విజయానికి బాటలు వేసింది. రఘునందన్‌రావు వ్యక్తిత్వం, ప్రజా సేవలో నిబద్ధత ఆయనకు విజాయాన్ని అందించింది. దుబ్బాక విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరు పేరున అభినందనలు.

-పవన్‌ కల్యాణ్‌, జనసేన అధ్యక్షుడు

రఘునందన్‌రావుది చరిత్రాత్మక విజయం. గెలుపు కోసం తెరాస డబ్బును వెదజల్లింది. అధికార దుర్వినియోగానికి పాల్పడింది. పోలీసులతో వేధింపులకు దిగింది. 

-బీఎల్‌ సంతోష్‌, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

తెరాస అప్రజాస్వామిక విధానాల వల్లే దుబ్బాకలో భాజపా విజయం సాధించింది. కేసీఆర్‌ నియంతృత్వ పోకడలు అవలంబించారు. అహంభావాన్ని ప్రజలు క్షమించరు. భాజపా విజయం నేపథ్యంలో లౌకిక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉంది.

-కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

దుబ్బాక నుంచి భాజపా ఘంటారావం పూరించింది. తెరాస నియంతృత్వ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారనడానికి తాజా ఫలితాలే నిదర్శనం.

-డీకే అరుణ,  భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు

 

దుబ్బాకలో విజయం సాధించిన తెలంగాణ ఉద్యమకారుడు రఘునందన్ రావుకు అభినందనలు. ఇది భాజపా గెలుపు కాదు.. రఘునందన్ రావు గెలుపు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన దుబ్బాక ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ ఆశించిన ఫలితం రాకపోయినప్పటికీ.. ఈ ఫలితాలు కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటిది. మల్లన్న సాగర్ రైతుల ఉసురు కేసీఆర్‌కు తగిలింది. ఈ ఫలితాలతోనైనా కేసీఆర్ కళ్లు తెరవాలి. దుబ్బాక ఓటమిపై పార్టీలో లోతైన సమీక్ష నిర్వహిస్తాం. కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరాశ పడొద్దు.. పోరాట పటిమను వీడొద్దు.

- దాసోజు శ్రవణ్‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని