20 ఏళ్లు.. 9 మంది ముఖ్యమంత్రులు

తాజా వార్తలు

Updated : 10/03/2021 15:53 IST

20 ఏళ్లు.. 9 మంది ముఖ్యమంత్రులు

ఉత్తరాఖండ్‌ చరిత్రంతా రాజకీయ అస్థిరత్వమే

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర భారతంలో దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్‌.. రెండు దశాబ్దాల క్రితం ఉత్తరప్రదేశ్‌ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచి మొదలైన పాలనా అస్థిరత్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కేవలం ఒకే ఒకసారి ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో ఉండగా.. ఓసారి రాష్ట్రపతి పాలన కూడా విధించాల్సి వచ్చింది. గడిచిన 20ఏళ్లలో 8 మంది నేతలు రాష్ట్ర పగ్గాలు తీసుకున్నారు. తాజాగా త్రివేంద్ర సింగ్‌ రావత్‌ రాజీనామాతో ఇప్పుడు తొమ్మిదో ముఖ్యమంత్రిగా తీరత్‌ సింగ్‌ రావత్‌ బాధ్యతలు చేపట్టబోతున్నారు.

16 నెలల్లో ముగ్గురు సీఎంలు..

2000 నవంబరు 9న ఉత్తరాఖండ్‌ రాష్ట్రం అవతరించిన తర్వాత భాజపా నేత నిత్యానంద స్వామి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ పదవిలో ఆయన ఏడాది మాత్రమే ఉన్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు 2001 అక్టోబరు 29న ముఖ్యమంత్రి పదవికి స్వామి రాజీనామా చేశారు. దీంతో భగత్‌ సింగ్‌ కోశ్యారీ సీఎం అయ్యారు. అయితే కోశ్యారీ కేవలం 122 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2002లో రాష్ట్రానికి తొలిసారిగా శాసనసభ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో భాజపాను ఓడించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రముఖ కాంగ్రెస్‌ నేత ఎన్‌డీ తివారీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అలా కేవలం 16 నెలల్లో రాష్ట్రంలో ముగ్గురు సీఎంలు మారారు.

తివారీ.. ఒకే ఒక్కడు

ఉత్తరాఖండ్‌ చరిత్రలో పూర్తి పదవికాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం ఎన్‌డీ తివారీ ఒక్కరే. 2002 మార్చి 2న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. 2007 మార్చి 7 వరకు ఐదేళ్ల పాటు పదవిలో ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన ఏ సీఎం కూడా పూర్తికాలం అధికారంలో కొనసాగలేదు. తాజాగా రాజీనామా చేసిన త్రివేంద్ర సింగ్‌ రావత్‌ దాదాపు నాలుగేళ్లు సీఎం పదవిలో ఉన్నారు. 

ఆ సీఎంలు.. మళ్లీ మళ్లీ

2007లో రాష్ట్రానికి జరిగిన రెండో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గద్దె దించి భాజపా అధికారంలోకి వచ్చింది. దీంతో బీసీ ఖందూరీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా.. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు సానుకూల ఫలితం రాకపోవడంతో ఖందూరీని దించి.. రమేశ్ పోఖ్రియాల్‌ను పార్టీ సీఎంను చేసింది. అయితే పోఖ్రియాల్‌పై భూకుంభకోణ ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో తిరిగి ఖందూరీకి రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. 

ఆ తర్వాత 2012లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. సీనియర్‌ నేత విజయ్‌ బహుగుణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2013లో ఉత్తరాఖండ్‌ను కుదిపేసిన వరదలు.. ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపించాయి. సహాయక చర్యలను సరిగ్గా చేపట్టలేదంటూ పెద్ద ఎత్తున వచ్చిన విమర్శలు.. బహుగుణ రాజీనామాకు దారితీశాయి. ఈ నేపథ్యంలో మరో సీనియర్‌ నేత హరీశ్‌ రావత్‌కు కాంగ్రెస్‌ పార్టీ సీఎం బాధ్యతలు అప్పగించింది. 

అయితే 2016లో హరీశ్ రావత్‌పై కొంతమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. అయితే ఆ తర్వాత శాసనసభలో ఆయన బలాన్ని నిరూపించుకోవడంతో 2016 మే 11న మళ్లీ సీఎంగా బాద్యతలు చేపట్టారు. కానీ 2017లో జరిగిన ఎన్నికల్లో హరీశ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ఓటమిపాలైంది. 

2017లో మళ్లీ భాజపా అధికారంలోకి రావడంతో త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇటీవల ఆయనకు సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి ఎదురైంది. రావత్‌ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన భాజపా ఎమ్మెల్యేలు.. సీఎం మార్పు కోరుతూ దిల్లీలో మకాం వేశారు. దీంతో రంగంలోకి దిగిన అధిష్ఠానం.. రావత్‌ను పదవి నుంచి తప్పుకోవాలని సూచించింది. అలా మంగళవారం ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం తీరత్‌ సింగ్‌ రావత్‌ను కొత్త ముఖ్యమంత్రి భాజపా శాసనసభాపక్షం నేడు ఎంపిక చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని