పీకే - పవార్‌ భేటీ.. 15రోజుల్లో మూడోసారి
close

తాజా వార్తలు

Published : 23/06/2021 15:58 IST

పీకే - పవార్‌ భేటీ.. 15రోజుల్లో మూడోసారి

దిల్లీ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌.. నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ బుధవారం మరోసారి సమావేశమయ్యారు. గత 15 రోజుల్లో వీరిద్దరూ భేటీ అవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. అంతేగాక, పవార్‌ నివాసంలో ప్రతిపక్ష నేతలు చర్చలు జరిపిన మరుసటి రోజే వీరు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ ఉదయం పవార్‌ నివాసానికి చేరుకున్న పీకే.. గంటపాటు ఆయనతో చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఏ విషయాలపై వీరు మాట్లాడుకున్నది అధికారికంగా తెలియకపోయినప్పటికీ.. మూడో కూటమి ఏర్పాటుపైనే మంతనాలు సాగించి ఉంటారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. 

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన పీకే.. ఈ నెల 11న తొలిసారి శరద్‌పవార్‌ను ముంబయిలో కలిశారు. ఆ తర్వాత గత సోమవారం వీరిద్దరూ మరోసారి సమావేశమయ్యారు. ఈ భేటీ జరిగిన మరుసటి రోజు అంటే.. మంగళవారం దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శరద్‌ పవార్‌ నివాసంలో ఎనిమిది మంది విపక్ష పార్టీలకు చెందిన నాయకులు సమావేశమై సమాలోచనలు జరిపారు. దీంతో మిషన్‌ 2024 లక్ష్యంగా తృతీయ కూటమికి అడుగులు పడుతున్నాయని ప్రచారం సాగింది. అయితే ఇది మూడో కూటమి ఏర్పాటు కోసం జరిగిన సమావేశం కాదని, కేవలం దేశ రాజకీయ వాతావరణాన్ని తెలుసుకోవడానికి, ఆలోచనలను పంచుకోవడానికి కలిసినట్లు భేటీలో పాల్గొన్న నేతలు చెప్పారు. 

అయితే పవార్‌తో ప్రతిపక్ష నేతలు భేటీ అయిన కొద్ది గంటలకే పీకే ఆయనను కలవడం ఇప్పుడు మరోసారి చర్చకు దారితీస్తోంది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో పవార్‌ను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పీకే - పవార్‌ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని