Corona Crisis: రాహుల్‌కు భాజపా కౌంటర్‌!
close

తాజా వార్తలు

Published : 23/06/2021 01:24 IST

Corona Crisis: రాహుల్‌కు భాజపా కౌంటర్‌!

దిల్లీ: కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందంటూ కాంగ్రెస్‌ విడుదల చేసిన శ్వేతపత్రంపై భాజపా స్పందించింది. కరోనా సంక్షోభ సమయంలో రాహుల్‌ గాంధీ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడింది. ఈ మేరకు భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కోవడంలో కేంద్రం దారుణంగా వ్యవహరించిందని, ప్రధాని కన్నీళ్లు ప్రజల ప్రాణాలను కాపాడలేకపోయాయంటూ రాహుల్‌ చేసిన విమర్శలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. కరోనాపై పోరాటంలో ఎక్కడైనా మంచి జరిగితే.. రాహుల్‌ గాంధీ దాన్ని పక్కదారి పట్టించేందుకు ఏదో ఒకటి చేస్తారన్న భయం తమకు క్రితం రోజు నుంచి కలుగుతోందన్నారు. సోమవారం 87లక్షల వ్యాక్సిన్‌ డోసుల పంపిణీతో ప్రపంచంలో ఒక్కరోజే అత్యధిక టీకాలు అందించిన తొలి దేశంగా భారత్‌ నిలిచిందని పేర్కొన్నారు. ప్రజలంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారన్నారు. కరోనాపై పోరాటంలో విజయం దిశగా ముందుకెళ్తున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ శ్వేతపత్రం విడుదల చేసి దాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని సంబిత్‌ మండిపడ్డారు.

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ మొదట్నుంచీ ప్రశ్నిస్తూ అడ్డు తగులుతోందన్నారు. కరోనా పోరాటం కీలక దశలో ఉన్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ రాజకీయాలు చేస్తూ, దాన్ని తప్పుదారి పట్టించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారంటూ సంబిత్‌ ఎద్దేవా చేశారు. సెకండ్‌ వేవ్‌ మొదలైంది, వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు సంకోచించేవారు ఎక్కువగా ఉన్నది కూడా కాంగ్రెస్‌ పార్టీ పాలనలోని రాష్ట్రాల్లోనే అని దుయ్యబట్టారు. ఎక్కువ కేసులు, మరణాలు నమోదైంది, అత్యధిక పాజిటివిటీ రేటు ఉన్నది కూడా ఆ రాష్ట్రాల్లోనే అని విమర్శించారు. వ్యాక్సిన్లను వికేంద్రీకరించాలన్న డిమాండ్‌ కూడా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల నుంచే ముందుగా వచ్చింది. ఆ తర్వాత యూ-టర్న్‌ తీసుకొని కేంద్రీకరించాలన్న డిమాండ్‌ చేసింది కూడా వారేనన్నారు. వర్చువల్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు, శ్వేతపత్రాలకు బదులు రాహుల్‌ గాంధీ ఆయా రాష్ట్రాలకు వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో స్వయంగా చూడాలన్నారు. రాజస్థాన్‌లో వ్యాక్సిన్లు వృథా అవుతున్న తీరును, ఛత్తీస్‌గఢ్‌లో దుర్వినియోగం అవుతున్న వైనాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే చేయించి తెలుసుకోవాలని హితవు పలికారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని