ముఖ్యమంత్రి పదవికి రెడీ: మెట్రోమ్యాన్‌

తాజా వార్తలు

Published : 20/02/2021 00:27 IST

ముఖ్యమంత్రి పదవికి రెడీ: మెట్రోమ్యాన్‌

దిల్లీ: త్వరలో భాజపాలో చేరిక ద్వారా రాజకీయాల్లో అడుగుపెడతానంటూ ప్రకటించిన ‘మెట్రో మ్యాన్‌’ శ్రీధరన్‌.. కేరళలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు. పార్టీ నిర్ణయం మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తానని.. ఒకవేళ పార్టీ కోరితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున కృషి చేస్తానని వివరించారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా భాజపాలో చేరడానికి గల కారణాన్ని వివరించారు.

భాజపాను కేరళలో అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని శ్రీధరన్‌ వివరించారు. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మూడు, నాలుగు ప్రాంతాల్లో అభివృద్ధిపై దృష్టి సారిస్తామని చెప్పారు. రాష్ట్రంలోకి పరిశ్రమలను తీసుకొస్తామన్నారు. గవర్నర్‌ పదవిపై తనకు పెద్దగా ఆశ లేదని, ఒకవేళ ఆ పదవి కేటాయించినా రాష్ట్రానికి పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, ఒక్కో వ్యక్తిపై రూ.1.2లక్షల అప్పు ఉందన్నారు.

కేరళ రాష్ట్రాన్ని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కొన్ని ఏళ్లుగా పాలిస్తున్నాయని శ్రీధరన్‌ అన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో విఫలమయ్యాయన్నారు. గత 20 ఏళ్లుగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. అందుకే ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా భాజపాలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. నిత్యం కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబిస్తూ ఆ రెండు ప్రభుత్వాలు కొన్ని ముఖ్యమైన అంశాలను పట్టించుకోకుండా వదిలేశాయని విమర్శించారు. అదే భాజపా అధికారంలోకి వస్తే కేంద్రంతో సఖ్యంగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చన్నారు. వృత్తిపరంగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించానని, స్వరాష్ట్రానికి తనవంతు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని