కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ
close

తాజా వార్తలు

Published : 28/02/2021 16:43 IST

కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్: రైతులు పండించిన శనగలకు మద్దతు ధర కల్పించడం సహా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉదాసీనత కారణంగానే రాష్ట్రంలో శనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. వ్యాపారులు, దళారులపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మార్కెట్లు పూర్తిగా దళారుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నారు. శనగకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5,100 మద్దతు ధరతో రైతులకు గిట్టుబాటు కావడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ జోక్యం లేకపోవడం వల్ల మద్దతు ధర రాకపోగా క్వింటాలుకు రూ. 700 నుంచి రూ.1000 వరకు తక్కువ చేస్తూ అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 3.43 లక్షల ఎకరాల్లో శనగ పంట వేశారని రేవంత్‌ వివరించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు పంటను తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. మరో 20 రోజుల్లో యాసంగి వరి పంట రాబోతుందని ప్రభుత్వ ప్రకటనలు, చర్యలతో శనగ రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారన్నారు. శనగల కొనుగోలుకు తక్షణమే మార్క్‌ఫెడ్‌కు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వా్నికి విజ్ఞప్తి చేశారు. కనీస మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు 60 లక్షల ఎకరాల్లో వేసిన వరి పంట మరో 20 రోజుల్లో రానున్నందున తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని