దీదీతో ఆర్జేడీ దోస్తీ.! 

తాజా వార్తలు

Published : 01/03/2021 12:30 IST

దీదీతో ఆర్జేడీ దోస్తీ.! 

కోల్‌కతా: శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్‌లో మరో కూటమి తెరపైకి వస్తోంది. బిహార్ వెలుపల తమ పార్టీని విస్తరించుకోవాలని ప్రయత్నిస్తున్న రాష్ట్రీయ జనతా దళ్‌.. రానున్న ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో జట్టు కట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ నేడు బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతాబెనర్జీతో భేటీ కానున్నారు. కాళీఘాట్‌లోని దీదీ నివాసంలో జరగబోయే ఈ భేటీలో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవలి కాలంలో పశ్చిమ బెంగాల్‌లో బిహారీల జనాభా పెరిగింది. హౌరా, పశ్చిమ బుర్ద్వాన్‌, కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాల్లో బిహారీలకు కీలక ఓటు శాతం ఉంది. దీంతో ఈ ప్రాంతాల్లో 10 నుంచి 12 స్థానాల్లో పోటీ చేయాలని ఆర్జేడీ భావిస్తోంది. ఇదే విషయంపై చర్చించేందుకు తేజస్వీ నేడు కోల్‌కతా వస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన దీదీతో భేటీ కానున్నట్లు తృణమూల్‌ నేత ఒకరు తెలిపారు. ఆ తర్వాత తృణమూల్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీతోనూ తేజస్వీ సమావేశం కానున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తృణమూల్‌ నేడు వెల్లడించాల్సి ఉండగా.. తేజస్వీతో భేటీ నేపథ్యంలో దీన్ని వాయిదా వేశారు. 

మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ శాసనసభ ఎన్నికల్లో దీదీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో తృణమూల్‌ కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. క్రీడా, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులకు టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. ఈశాన్య రాష్ట్రమైన అసోం శాసనసభ ఎన్నికల్లోనూ ఆర్జేడీ బరిలోకి దిగుతోంది. ఇటీవల ఆ రాష్ట్రానికి వెళ్లిన తేజస్వీ యాదవ్‌.. కూటమి కోసం పలు పార్టీలకు ఆహ్వానం పలికారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని