సొంత గూటికి పైలట్‌?.. రాహుల్‌తో భేటీ!

తాజా వార్తలు

Updated : 10/08/2020 16:14 IST

సొంత గూటికి పైలట్‌?.. రాహుల్‌తో భేటీ!

జైపుర్‌: అసెంబ్లీ సమావేశాల తేదీ సమీపిస్తున్న వేళ రాజస్థాన్‌ రాజకీయాలు మళ్లీ రక్తికడుతున్నాయి. నిన్నటి వరకు ఎవరి క్యాంపులు వారివే.. ఎవరి వ్యూహాలు వారివే అన్నట్లు సైలెంట్‌గా ఉన్న రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో ఆయన సోమవారం భేటీ అయ్యారు.

సచిన్‌ పైలట్‌ సహా 19 మంది ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా క్యాంపు రాజకీయాలు నడుపుతున్న సంగతి తెలిసిందే. పార్టీపై తిరుగుబాటు ప్రకటించిన నాటి నుంచి సచిన్‌ పైలట్‌ను వెనక్కి రప్పించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. అయినా సచిన్‌ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే, ఆగస్టు 14న అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సచిన్‌ పైలట్‌ మనసు మార్చుకుని పార్టీలోకి పునరాగమనం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాహుల్‌తో భేటీ అయ్యారు. రాహుల్‌తో భేటీ విషయంలో ఇద్దరు పార్టీ సీనియర్‌ నేతలు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.

మరోవైపు ఆదివారం జరిగిన సీఎల్పీ భేటీలో పైలట్‌ వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి తీసుకోకూడదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, అశోక్‌ గహ్లోత్‌ మాత్రం పార్టీ అధిష్ఠానానికే తుది నిర్ణయం విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. అధిష్ఠానానికి క్షమాపణ చెప్పి, అసెంబ్లీలో బల పరీక్షకు పార్టీకి అనుకూలంగా ఓటేస్తే వారిని క్షమించి తిరిగి తీసుకుంటామని సీడబ్ల్యూసీ సభ్యుడు ఒకరు తెలిపారు. రాహుల్‌తో భేటీ అనంతరం ఓ స్పష్టత రానుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని