చమురు ధరలపై ప్రధానికి సోనియా లేఖ

తాజా వార్తలు

Published : 21/02/2021 20:23 IST

చమురు ధరలపై ప్రధానికి సోనియా లేఖ

దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు వరుసగా పెరగడంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల కష్టంతో ప్రభుత్వం లాభాలను గడిస్తోందని ఆరోపించారు. వెంటనే పెరిగిన చమురు ధరలను తగ్గించాలని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆమె లేఖ రాశారు. ఓ వైపు దేశ జీడీపీ క్షీణిస్తుంటే.. మరోవైపు గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరుగుతున్నాయని దుయ్యబట్టారు. 

చమురు, గ్యాస్‌ ధరలు పెరుగుదలతో ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలు చూసి ఈ లేఖ రాస్తున్నట్లు సోనియా పేర్కొన్నారు. దేశంలో ఉద్యోగాలు హరించుకుపోయాయని, ఆదాయాలు దారుణంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో లాభార్జనపై ప్రభుత్వం సారించడం బాధాకరమని విమర్శించారు.

దేశంలో ఎప్పుడూ లేని స్థాయికి చమురు ధరలు చేరాయని సోనియా అన్నారు. ఓ వైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుతున్నా.. చమురు ధరలు నిరంతరం పెరగడాన్ని ఆమె తప్పుబట్టారు. యూపీఏ హయాంతో పోల్చుకుంటే ప్రస్తుతం క్రూడాయిల్‌ ధరలు సగం మాత్రమే ఉన్నాయని చెప్పారు. అధికారం చేపట్టి నేటికి ఏడేళ్లు గడస్తున్నా.. మీ ప్రభుత్వ వైఫల్యాలకు గత ప్రభుత్వాలను బాధ్యులను చేయడమేంటని ప్రశ్నించారు. దేశీయ చమురు ఉత్పత్తి 2020లో 18 ఏళ్ల కనిష్ఠానికి చేరిందన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. స్వప్రయోజనాలు వీడి ప్రజలపై భారం పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ అంశంలో సాకులు వెతక్కుండా సమస్యకు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నట్లు సోనియా హితవు పలికారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని