కిరణ్‌ బేదీ ఆకస్మిక తొలగింపు.. కారణమిదేనా?

తాజా వార్తలు

Published : 18/02/2021 01:48 IST

కిరణ్‌ బేదీ ఆకస్మిక తొలగింపు.. కారణమిదేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒక్కసారిగా కలకలం. ఓ వైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడగా.. మరోవైపు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) కిరణ్‌ బేదీని తొలగిస్తూ రాష్ట్రపతి భవన్‌ నుంచి ప్రకటన వెలువడడం చర్చనీయాంశమైంది. రెండు వేర్వేరు అంశాలుగా కనిపిస్తున్నా.. దీని వెనుక భాజపా పెద్దల వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోంది. ఎన్నో రోజులుగా ఎల్‌జీని తొలగించాలన్న కాంగ్రెస్‌ డిమాండ్‌ అనుగుణంగా కిరణ్‌ బేదీని తొలగించడం వెనుక అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు ముడిపడి ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దిల్లీ ఎన్నికల్లో భాజపా తరఫున సీఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసిన కిరణ్‌ బేదీ పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా 2016లో బాధ్యతలు చేపట్టారు. అక్కడికి కొద్దిరోజులకే నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంతో పేచీలు మొదలయ్యాయి. నామినేటెడ్‌ ఎమ్మెల్యేలుగా ఇద్దరు భాజపా వ్యక్తులను నియమించడం మొదలుకుని.. ఎన్నికల కమిషనర్ల నియామకం, ఉచిత బియ్యం, చీరల పంపకాన్ని అడ్డుకోవడం వంటివి వివాదానికి కారణమయ్యాయి. తమ రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆమె మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని, ఆమెను తొలగించాలంటూ సీఎం స్వయంగా దీక్షకు దిగారు. వారం క్రితం రాష్ట్రపతిని కలిసి ఇదే విషయాన్ని విన్నవించారు.

కాంగ్రెస్‌కు ఆయుధం కాకూడదని..

ఎల్‌జీ కిరణ్‌ బేదీ తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే కాదు.. ప్రజల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రహదారి భద్రతకు సంబంధించి ఆమె ఇటీవల ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. ఎవరైనా హెల్మెట్‌ పెట్టుకోకపోతే వాహనం స్వాధీనం చేసుకోవాలని, లైసెన్స్‌ సీజ్‌ చేయాలని ఆమె ఆదేశించారు. ఈ విషయంలో దశలవారీగా నిబంధనలు విధించాలని ప్రభుత్వం అనుకున్నా.. బేదీ మాత్రం నేరుగా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌కు ఆదేశాలివ్వడం ప్రజల్లో వ్యతిరేకత పెంచింది. దీంతో కాంగ్రెస్‌కు ఎల్‌జీ రూపంలో ఓ ఆయుధం దొరికినట్లయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బుధవారం పుదుచ్చేరి చేరుకుని కిరణ్‌బేదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించాలని నిర్ణయించుకున్నారట. ఆ అవకాశం కాంగ్రెస్‌కు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఒక్కరోజు ముందు ఆమె తొలగింపు జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. పైగా త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తమిళం మాట్లాడే పుదుచ్చేరి ప్రజలకు చేరువ కావాలంటే ఆ భాష మాట్లాడే, సంస్కృతిని తెలిసిన వ్యక్తయితే మేలని భాజపా పెద్దలు భావించినట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ కీలక నేత నమశివాయం, ఎమ్మెల్యే తీపాయన్‌దాన్‌ రాజీనామా చేసి ఇప్పటికే భాజపాలో చేరారు. ఎమ్మెల్యేలు మల్లాడి కృష్ణారావు సోమవారం, జాన్‌కుమార్‌ మంగళవారం రాజీనామాలు చేయడం ఒక్కసారి కాంగ్రెస్‌ను అయోమయంలో పడేసింది. దీంతో కాంగ్రెస్‌ చేతికి ఆయుధం కాకుండా.. కాంగ్రెస్‌ను దెబ్బతీసే వ్యూహాన్ని పక్కాగా కమలదళం అమలు చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని