పేరు చెబుతున్నా.. కేసు పెట్టుకోండి: సువేందు

తాజా వార్తలు

Published : 21/01/2021 19:34 IST

పేరు చెబుతున్నా.. కేసు పెట్టుకోండి: సువేందు

కోల్‌కతా: పశ్చిమ్‌బంగలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు అధికార తృణమూల్‌ను వీడి భాజపాలో చేరగా.. ఎన్నికల ప్రకటన విడుదలయ్యే సమయానికి మరింత  మంది వచ్చి చేరుతారని కమలదళం భావిస్తోంది. మరోవైపు ఇటీవల భాజపాలో చేరిన సువేందు అధికారి, తృణమూల్‌ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఇన్నాళ్ల నుంచి దోపిడీల మేనల్లుడు అంటున్నారు గానీ,  అతడి పేరు చెప్పడానికి భయపడుతున్నారంటూ ఇటీవల దీదీ చేసిన వ్యాఖ్యలపై సువేందు అధికారి స్పందించారు. పశ్చిమ మిడ్నాపూర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..‘ ఇప్పుడు పేరు చెబుతున్నా.. నాపై కేసు పెడితే పెట్టుకోండి’ అంటూ సవాల్‌ విసిరారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీని ‘దోపిడీల మేనల్లుడు’ అంటూ భాజపా నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

నందిగ్రాం నియోజకవర్గంలో దీదీపై పోటీ చేసి విజయం సాధిస్తానని ఇదివరకే ప్రతిజ్ఞ చేసిన సువేందు.. తాజాగా మరో సవాల్‌ విసరడం చర్చనీయాంశమైంది. ఖరగ్‌పూర్‌ నియోజకవర్గంలోనూ తృణమూల్‌ను ఎలాగైనా ఓడించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఖరగ్‌పూర్‌లో తృణమూల్‌ విజయానికి కృషి చేశానని, కానీ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ పిలుపు మేరకు తాజాగా ఆ స్థానంలో భాజపా విజయానికి కృషి చేస్తానని సువేందు అధికారి తెలిపారు.

అలాగైతే రాజకీయాలను వదిలేస్తా
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.  దీనిపై అధికారి స్పందిస్తూ.. తాను కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీదీపై విజయం సాధించక పోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. ‘‘ ఎన్నికల సమయంలోనే మమతా బెనర్జీ నందిగ్రామ్‌ వస్తారు. అక్కడి ప్రజల కోసం ఏం చేశారో మమతా బెనర్జీ చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఆ స్థానంలో దీదీపై ఎవరు పోటీ చేసినా కనీసం 50 వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని సువేందు పునరుద్ఘాటించారు.

ఇవీ చదవండి

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళతాం: విశ్వరూప్

ప్రభుత్వ అండతోనే విగ్రహాల ధ్వంసం: కన్నా


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని