
తాజా వార్తలు
ఏపీ సీఎం జగన్కు నారా లోకేశ్ సవాల్
నెల్లూరు: సీఎం జగన్ గానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ వైఎస్ వివేకాను హత్య చేయలేదని వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయగలరా అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆయన బుధవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ఈ నెల 14న ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, సీఎం జగన్ అందుకు సిద్ధమా అని ప్రశ్నించారు.
వైకాపాకు చెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతిచెందడంతో తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 17న పోలింగ్ నిర్వహించనున్నారు. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం వెల్లడించనున్నారు. తెదేపా తరఫున మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. వైకాపా తరఫున గురుమూర్తి, భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీలో ఉన్నారు.