
తాజా వార్తలు
‘జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు’
తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు
అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో అధికార యంత్రాంగం పాల్గొనకుండా చేయడం ద్వారా సీఎం జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ తన అధికారులు వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా ఆయన బాధ్యత తీసుకోవాలన్నారు.
రాజ్యాంగానికి లోబడి పని చేస్తామని ప్రమాణం చేసిన ఉద్యోగులు, అధికారులు దాన్ని గుర్తు చేసుకోవాలని యనమల సూచించారు. ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని, అధికార యంత్రాగమే శాశ్వతమని వారు గ్రహించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక విధుల్లో పాల్గొనటం లేదని చెప్పడం దేశ చరిత్రలో లేదని ఆక్షేపించారు. స్థానిక పాలన అందించటంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పిందే చేస్తూ.. రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడటం ఉద్యోగులకు తగదని యనమల సూచించారు. తమ వ్యవహారశైలిపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి..
ఇంకా అస్పష్టతే
తిరుపతి ఉపఎన్నికే పునాది..: సోము వీర్రాజు