‘‘ఆనాడు మద్దతిచ్చి ఇప్పుడు మాటమార్చారు’’

తాజా వార్తలు

Published : 03/08/2020 01:21 IST

‘‘ఆనాడు మద్దతిచ్చి ఇప్పుడు మాటమార్చారు’’

సీఎం జగన్‌పై తెదేపా నేతల విమర్శలు

అమరావతి: ‘‘అవినీతిపరుల పాలనలో మూడు ప్రాంతాల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?.. సీఆర్‌డీఏ రద్దు చేయడమే అభివృద్ధి అవుతుందా?’’అని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఏపీలో మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అమరావతి రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతు పలికిన తెదేపా నేతలు.. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌ తీరుపై మండిపడుతున్నారు. స్థానికుల ఆస్తులన్నీ భూకబ్జాదారులకు కట్టబెట్టడమే వైకాపా చేసే పని అని యనమల విమర్శించారు. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేసి సీఆర్‌డీఏ రద్దు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యత లేని సీఎంగా చరిత్రలో జగన్‌ మిగిలిపోతారన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో చంద్రబాబుపై కక్ష సాధింపే జగన్‌ లక్ష్యంగా ఉందని మాజీమంత్రి భూమా అఖిల ప్రియ ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్ర భవిష్యత్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఎవరూ కోరుకోని మూడు రాజధానుల నిర్ణయంతో అన్ని ప్రాంతాలకు నష్టమేనని వ్యాఖ్యానించారు. మొండిగా మార్చాలనుకుంటే తొలి ప్రాధాన్యం రాయలసమీకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమను కాదని విశాఖకు రాజధాని తరలించడం జగన్‌ సొంత అజెండానేని విమర్శించారు. 

ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా బిల్లులను గవర్నర్‌ ఆమోదించడం బాధాకరం. బిల్లులు ఆమోదం పొందినంత మాత్రాన వైకాపా ప్రభుత్వం సాధించిందేమి లేదు. ఐదు కోట్ల ఆంధ్రుల తరఫున రాజధానిపై ఉన్నత న్యాయస్థానాల్లో పోరాడతాం. అమరావతిపై దుష్ప్రచారం చేసి ఇప్పటికే ఏడాదిన్నర కాలం వృథా చేశారు. రాజధానుల పేరుతో మభ్య పెట్టడం తప్ప మూడు భవనాలు కూడా కట్టలేదు. 

- కళా వెంకట్రావు, ఏపీ తెదేపా అధ్యక్షుడు

రాజధానికి పూర్తి మద్దతిస్తున్నామని జగన్‌ చెప్పింది వాస్తవం కాదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు రాజధానులపై ఎందుకు మాట్లాడలేదు? రాజ్యాంగానికి వ్యతిరేకంగా గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని విషయంలో సోము వీర్రాజు పూటకో మాట మాట్లాడుతున్నారు. రాజధాని శంకుస్థాపన ప్రధాని మోదీ చేతులతోనే చేశారు. భాజపా ఈ విషయాన్ని పునరాలోచించుకోవాలి. 

- అయ్యన్న పాత్రుడు, తెదేపా నేత

ప్రతిపక్ష నేతగా జగన్‌ ఆనాడు మద్దతు పలికి ఇప్పుడు మాటమార్చారు. రాజ్యం, రాజ్యాంగం గొప్పది.. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. రైతులు, మహిళలది ధర్మపోరాటం.. న్యాయపోరాటం. న్యాయస్థానాల్లో రైతులు విజయం సాధించడం ఖాయం. కరోనా వేళ ప్రాణాలకు తెగించి రైతులు పోరాడుతున్నారు. రాజధాని పోరాటంలో 70 మంది చనిపోతే ప్రభుత్వం నుంచి ఒక్కరూ కూడా పరామర్శించేందుకు రాలేదు. ఇది 29 గ్రామాల సమస్య కాదు. ఐదు కోట్ల మంది ప్రజల సమస్య. 

- దేవినేని ఉమ, తెదేపా నేత

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని