గెలుపు తెదేపాదే: ఇది జగన్‌ పాలనకు రెఫరెండం
close

తాజా వార్తలు

Published : 06/03/2021 12:47 IST

గెలుపు తెదేపాదే: ఇది జగన్‌ పాలనకు రెఫరెండం

ఎంపీ కేశినేని నానితో ముఖాముఖి

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయవాడ నగరపాలిక ఎన్నికల్లో మేయర్‌ పీఠాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలతో ఉంది. తొలిసారి తమ జెండా ఎగురవేయాలని అధికార పార్టీ వైకాపా ఉవ్విళ్లూరుతోంది. రెండు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ గెలుపుపై ఆ పార్టీ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపీ కేశినేని నాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంపై సీఎం జగన్‌ కక్ష పెట్టుకున్నారని ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని ఆయన పేర్కొంటున్నారు. ప్రభుత్వ విధానాలతో వైకాపాపై వ్యతిరేకత ఒక్క విజయవాడకే పరిమితం కాలేదని, రాష్ట్రమంతా ప్రజాగ్రహం ఉందన్నారు. తెదేపాలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువంటున్న కేశినేని నానితో ప్రత్యేక ముఖాముఖి.

విజయవాడ నగరపాలిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి?
విజయవాడలో 64 డివిజన్లు ఉన్నాయి. మేము, మా మిత్రపక్షం సీపీఐ కలిసి 50 డివిజన్లలో విజయ ఢంకా మోగించబోతున్నాం.

రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఇటీవల మీరు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనిదే నగరాభివృద్ధి ఎలా సాధ్యం?
జగన్‌ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతాన్ని ఎడారిలా మార్చారు. ఇక్కడ ఫ్లైఓవర్‌ కావాలని డిమాండ్‌ చేస్తే అందుకు వీలుకాదని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో కేంద్రం నుంచి రూ.480 కోట్లు తీసుకొచ్చి ఫ్లైఓవర్‌ నిర్మించాం. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ నిర్మించాం. దాదాపు రూ.1000 కోట్లు అశోక్‌ గజపతి రాజు ఇచ్చారు. వర్షం నీరు నిలువకుండా అర్బన్‌ డెవలప్‌ మినిస్ట్రీ నుంచి రూ.480 కోట్లు తీసుకొచ్చి వరద నీటి కాల్వలు నిర్మించాం. రూ.150 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాం. కరోనా సమయంలో ఆ ఆసుపత్రి విశేష సేవలందించింది. ప్రస్తుతం రూ.2000 కోట్లతో ఎయిమ్స్‌ నిర్మిస్తున్నాం. రూ.6000 కోట్లకు పైగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయించాం. ఎంపీగా మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ నగరాన్ని అభివృద్ధి చేయిస్తా.

రాజధాని తరలింపు అంశం ఈ ఎన్నికలపై ఏమేర ప్రభావం చూపనుంది?
ప్రజలకు భారీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్‌ పేర్కొంటున్నారు. కానీ ఈతకాయంత అందించి తాటికాయంత లాగేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చేది చీమంత, చెప్పుకునేది మాత్రం కొండంత. ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదు. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచారు. విజయవాడ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలంతా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ఆగ్రహావేశాలతో ఉన్నారు. 

మున్సిపల్‌ ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే పన్నుల భారం పడకుండా అడ్డుకుంటామని మానిఫెస్టోలో ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్న మీకు అది ఎలా సాధ్యం?
గత ఐదు సంవత్సరాలు విజయవాడ నగరపాలక సంస్థ మా ఆధీనంలో ఉంది. అప్పుడు ఒక్క రూపాయి కూడా పన్నులు పెంచలేదు. ఒక్క రూపాయి కూడా నీటి ధరలు పెంచలేదు. 2014లో అధికారంలోకి వచ్చేసరికి మున్సిపల్‌ సిబ్బంది 6 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. తక్షణం ఆ జీతాలు చెల్లించి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో నం.010 తీసుకొచ్చాం. ఈ జీవోతో నెలకు రూ.15 కోట్లు మున్సిపల్‌కు ఆదాయం వస్తుంది. సంవత్సరానికి రూ.180 కోట్లు. ఐదేళ్లకు రూ.900 కోట్లు సమకూరుతుంది. ఈ నగర అభివృద్ధికి ఆ మొత్తం చాలు. జగన్‌ ప్రభుత్వం పెంచిన పన్నులను విజయవాడలో అమలు చేయబోం.

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్‌లో తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలున్నాయని, అవి పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయని విమర్శలున్నాయి. ముఖ్యంగా మీతోనే విభేదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనికి మీరేమంటారు?
ఓ కుటుంబంలో నలుగురు వ్యక్తులుంటే వారందరికి భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. వాటిని విభేదాల కింద చూడొద్దు. మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. చిన్నచిన్న సమస్యలు వచ్చినా వాటిని అధిగమిస్తూ ముందుకెళతాం.

అమరావతి తరలింపు రెఫరెండమ్‌గా ఈ ఎన్నికలను భావించవచ్చా? తెదేపా గనక మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోతే ఇక్కడ రాజధాని సెంటిమెంట్‌ లేదనేది స్పష్టమవుతుంది అని వైకాపా పేర్కొంటోంది. దీనికి మీరేమంటారు?
ఎన్నికలనేవి అవినీతి లేకుండా జరగాలి. కానీ ఇక్కడ డబ్బు కురిపిస్తున్నారు. మద్యం ప్రవహిస్తోంది. బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాడులు చేస్తున్నారు. మహిళా కార్పొరేట్‌ అభ్యర్థుల మీద కూడా దాడులకు పాల్పడుతున్నారు. విజయవాడలో తెదేపా గెలిస్తే అమరావతికే కాదు, జగన్ పాలన మొత్తానికి రెఫరెండంగా మారుతుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని