Ap News: దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై ఏపీ సర్కార్‌ అప్పీల్‌.. తోసిపుచ్చిన డివిజన్ బెంచ్

తాజా వార్తలు

Published : 08/10/2021 14:45 IST

Ap News: దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై ఏపీ సర్కార్‌ అప్పీల్‌.. తోసిపుచ్చిన డివిజన్ బెంచ్

హైదరాబాద్: గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై స్టే ఎత్తివేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. ఎంపీపీ ఎన్నికపై స్టే ఇవ్వటంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. ఎన్నిక నిర్వహించేలా చూడాలని ప్రభుత్వంతో పాటు వైకాపా తరఫున గెలిచిన ఎంపీటీసీ సభ్యులు అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ అప్పీల్‌ని విచారించింది. ఎంపీపీ ఎన్నికపై స్టే ఎత్తివేయటం కుదరదని స్పష్టం చేసింది. అయితే కుల ధ్రువీకరణ అంశం తేలాలంటే రెండు నెలల సమయం పడుతుందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. అన్ని రోజుల సమయం ఎందుకన్న డివిజన్ బెంచ్.. తెదేపా ఎంపీపీ అభ్యర్థి కుల ధ్రువీకరణ అంశాన్ని వారం రోజుల్లోగా తేల్చాలని ఆదేశించింది. ఎంపీపీ ఎన్నికపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు అమలవుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నిక వాయిదా వేయాలన్న తెదేపా ఎంపీపీ అభ్యర్థి షేక్‌ జబీన్‌ వినతిని పరిశీలించిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జబీన్‌ కుల ధ్రువీకరణ పత్రంపై తగిన నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం వారం రోజుల గడువు విధించింది. ఆ తర్వాత ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

దుగ్గిరాల మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. తెలుగుదేశం 9, వైకాపా 8, జనసేన ఒక స్థానంలో విజయం సాధించాయి. బీసీలకు ఎంపీపీ పదవి రిజర్వ్‌ కాగా, తెలుగుదేశం నుంచి గెలిచిన ఏకైక బీసీ అభ్యర్థి షేక్‌ జబీన్‌కు కులధ్రువీకరణ పత్రం ఇవ్వడంలో అధికారులు ఆలస్యం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే రెండు సార్లు ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ చేపట్టినా తెలుగుదేశం సభ్యులు హాజరు కాకపోవడంతో కోరం లేక వాయిదా పడింది. మరో వైపు దుగ్గిరాల ఎంపీపీ పదవిని తెదేపా కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని