AP News: తెదేపా కార్యాలయాలపై దాడులు.. కేంద్ర బలగాల సాయం కోరిన చంద్రబాబు 

తాజా వార్తలు

Updated : 19/10/2021 19:12 IST

AP News: తెదేపా కార్యాలయాలపై దాడులు.. కేంద్ర బలగాల సాయం కోరిన చంద్రబాబు 

అమరావతి: ఏపీ రాజకీయాల్లో కొత్త సంస్కృతి మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలపైనే దాడులు జరుగుతున్నాయి. సీఎం జగన్‌ను తెదేపా నేతలు విమర్శించడాన్ని నిరసిస్తూ వైకాపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తెదేపా కార్యాలయాలు, నేతల నివాసాలపై దాడులకు తెగబడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈదాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసమయ్యాయి. కార్యాలయం వద్ద నిలిపిఉంచిన వాహనాలపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీంతో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో తెదేపా కార్యాలయంలో ఉన్న కెమెరా మెన్‌ బద్రీకి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఆపార్టీ శ్రేణులు జాతీయరహదారిపై ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. తెదేపా కార్యాలయంపై దాడి విషయం తెలుసుకన్న తెదేపా శ్రేణులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. 

విజయవాడలో పట్టాభి ఇంట్లో ఫర్నిచర్‌ ధ్వంసం
విజయవాడలోని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై దాడిచేసిన వైకాపా శ్రేణులు ఇంటి ఆవరణలోని కారు, ద్విచక్రవాహనం, ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దాదాపు 200 మంది ఒక్కసారిగా ఇంటిపై దాడికి దిగారని పట్టాభి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. పట్టాభి దొరికితే చంపేస్తామంటూ పెద్దగా కేకలు వేస్తూ ఇంట్లోని ఫర్నిచర్‌ మొత్తం ధ్వంసం చేశారని తెలిపారు. వైకాపా మహిళా కార్యకర్తలు విశాఖలోని తెదేపా కార్యాలయంలోకి  చొచ్చుకెళ్లారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి  యత్నించారు. దీంతో పోలీసులు వైకాపా శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపాకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణులు నినాదాలు చేశారు. తెదేపా నేత లింగారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వైకాపా శ్రేణులు యత్నించారు. 

రేణిగుంటలో రణరంగం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని రేణిగుంటలో తెదేపా నేతల ర్యాలీపై వైకాపా శ్రేణులు దాడికి దిగాయి. తెదేపా నేత బొజ్జల సుధీర్‌రెడ్డి, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నరసింహయాదవ్‌ ఆధ్వర్యంలో రేణిగుంట అంబేడ్కర్‌ విగ్రహం నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు ఆపార్టీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని రేణిగుంట సర్పంచి నగేశ్‌, ఉప సర్పంచి సుజాత, వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. తెదేపా నేతలపై చెప్పులు, చీపుర్లతో వైకాపా నేతలు దాడి చేశారు. పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఈ ఘటన జరగడంతో అప్రమత్తమైన పోలీసులుఇరువర్గాలను చెదరగొట్టారు. ర్యాలీ ముగించుకుని తెదేపా నేతలు కారులో వెళ్తున్న సమయంలో సుధీర్‌రెడ్డి, నరసింహయాదవ్‌, తెదేపా నేతల వాహనాలపై వైకాపా శ్రేణులు మరోసారి రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. 

తెదేపా కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు

దాడి విషయం తెలుసుకున్న చంద్రబాబు వెంటనే మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి పార్టీ శ్రేణులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వైకాపా శ్రేణుల దాడిలో దెబ్బతిన్న కార్యాలయ సామగ్రి, ధ్వంసమైన నేతల వాహనాలను పరిశీలించారు. తెదేపా నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, అశోక్‌బాబు, పట్టాభి తదితరులు పార్టీ కార్యాలయానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. 

డీజీపీ ఆఫీస్‌కు ఫోన్‌ చేసినా స్పందన లేదు: అశోక్‌బాబు

మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనను ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఖండించారు. లేళ్ల అప్పిరెడ్డి సారథ్యంలో జనాన్ని పోగు చేసి తెదేపా కార్యాలయంపై దాడికి పంపారని ఆరోపించారు. వందలాది మంది ఒక్కసారిగా  పార్టీ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు, కార్లు ధ్వంసం చేశారని వివరించారు. తెదేపా కార్యాలయం పక్కనే డీజీపీ ఆఫీసు ఉంది... డీజీపీ కార్యాలయానికి పోన్‌ చేసిన స్పందనలేదని అశోక్‌బాబు అన్నారు. 

గవర్నర్‌కు చంద్రబాబు ఫోన్‌

రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై దాడులకు సంబంధించి తెదేపా అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూ షణ్ హరిచందన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దాడుల విషయాన్ని గవర్నర్‌కు వివరించారు. అనంతరం కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో పరిణామాలు వివరించారు. కేంద్ర బలగాల సాయం కోరారు. బలగాలు పంపేందుకు కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందించినట్టు తెదేపా వర్గాలు వెల్లడించాయి.





Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని