కేసీఆర్‌ హామీలు ఏమయ్యాయి?: బండి సంజయ్‌

తాజా వార్తలు

Published : 19/07/2021 01:06 IST

కేసీఆర్‌ హామీలు ఏమయ్యాయి?: బండి సంజయ్‌

 భువనగిరి: ఎన్డీఏ ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. కాంగ్రెస్, భాజపాయేతర ప్రభుత్వాల పాలనలో దేశవ్యాప్తంగా రెండు ఎయిమ్స్ ఆస్పత్రులను ఏర్పాటు చేశాయన్నారు. ఎన్డీఏ పాలనలో ఏకంగా 21 ఎయిమ్స్ ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆదివారం బీబీ నగర్‌ ఎయిమ్స్‌ను సందర్శించిన బండి సంజయ్‌ ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ విభాగం సేవలను ప్రారంభించారు. అనంతరం ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ భాటియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆస్పత్రిలో అందిస్తున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎంపీగా, ఎయిమ్స్ బోర్డు సభ్యుడిగా తొలిసారి ఆస్పత్రిని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ వైద్య సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తున్నారంటూ అభినందించారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రతి ఏటా బడ్జెట్‌లో వైద్య రంగానికి కేటాయింపులు పెంచుకుంటూ పోతోందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వైద్య రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా 137 శాతం అదనపు నిధులను కేటాయించారని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా వేలాది కోట్ల రూపాయలు ప్రజల వైద్యం కోసం మోదీ సర్కార్ ఖర్చు చేస్తోందని వివరించారు. బీబీనగర్ ఎయిమ్స్ కోసం కూడా ప్రతి ఏటా నిధులు పెంచుతూ పొతోందన్నారు. లక్షలాది మందికి ఉన్నతమైన వైద్య సేవలందించే గొప్ప ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు ఏమాత్రం అందకపోవడం బాధాకరమన్నారు. తెరాస ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో హైదరాబాద్‌కు నాలుగు దిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. ఆ హామీలు ఏమైయ్యాయో.. ఆ ప్రతిపాదనలు ఎటు పోయాయో కేసీఆర్‌కే తెలియాలని ఎద్దేవా చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని