Rotational CM: ఛత్తీస్‌గఢ్‌లో నాయకత్వ మార్పు ఉంటుందా?

తాజా వార్తలు

Published : 24/08/2021 16:38 IST

Rotational CM: ఛత్తీస్‌గఢ్‌లో నాయకత్వ మార్పు ఉంటుందా?

ముఖ్యమంత్రి పీఠంపై దిల్లీకి చేరిన కాంగ్రెస్‌ నేతలు

(2018లో రాహుల్‌ గాంధీతో భూపేశ్‌ బఘేల్‌, టీఎస్‌ సింగ్‌ డియో)

ఛత్తీస్‌గఢ్‌: గతకొంత కాలంగా దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రాభవం తగ్గిపోతోందని వార్తలు వస్తోన్న సమయంలోనే.. అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లోనూ పార్టీ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోగా, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ని అంతర్గత విభేదాలు వెంటాడుతున్నాయి. ఎలాగోలా వాటిని పరిష్కరించుకుంటూ వస్తోన్న కాంగ్రెస్‌ అధిష్ఠానానికి.. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో రొటేషన్‌ ఫార్ములాలో భాగంగా ముఖ్యమంత్రి పదవిని తనకు అప్పగించాలంటూ ఓ మంత్రి డిమాండ్‌ చేయడం ఆ రాష్ట్ర కాంగ్రెస్‌లో విభేదాలకు కారణమయ్యింది. దీంతో ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌, ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్‌సింగ్‌ డియో వ్యవహారం దిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి పీఠంపై వాదన వినిపించేందుకు ఇరువురు నాయకులు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.

అధిష్ఠానం వద్దకు ఇద్దరు నేతలు..

ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి మార్పుపై చర్చ నడుస్తోన్న సమయంలో సీఎం భూపేశ్‌ బఘేల్‌, ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్‌ సింగ్‌ డియా దిల్లీ పర్యటన చేపట్టారు. రాహుల్‌, ప్రియాంక గాంధీలతో పాటు వీలైతే కాంగ్రెస్‌ అధ్యక్షురాలిని కలిసి తమ వాదన వినిపించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నేడు రాహుల్ గాంధీని కలిసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఛత్తీస్‌గఢ్‌ సీఎం విషయంలో కాంగ్రెస్‌ అధినాయకత్వం ప్రస్తుతానికి నిర్ణయమేమీ తీసుకోనప్పటికీ.. అక్కడ నెలకొన్న విబేధాలపై దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రొటేషనల్‌ ఫార్ములాలో సీఎం..

ఛత్తీస్‌గఢ్‌లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం గత ఎన్నికల్లో ఓటమి చెందింది. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవడం తలనొప్పిగా మారింది. దీనిపై ఓవైపు భూపేశ్ బఘేల్‌, మరోవైపు సీనియర్‌ నేత టీఎస్‌ సింగ్‌ డియో వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. చివరకు ఓ నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. రొటేషనల్‌ ఫార్ములాలో ఇద్దర్నీ సీఎంగా చేసేందుకు అంగీకరించింది. తొలి రెండున్నర ఏళ్లు భూపేశ్‌ బఘేల్‌ను ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని సూచించింది. అందుకు అనుగుణంగానే అధికార పగ్గాలు చేపట్టిన భూపేశ్‌ బఘేల్‌.. ఈ ఏడాది జూన్‌ 17 నాటికి 2.5 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో ముందస్తుగా అనుకున్న ప్రకారం, డియోకు సీఎం బాధ్యతలు అప్పజెప్పాలని ఆయన వర్గం నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మొదలయ్యాయి.

సీఎం కాకుంటే డియో పార్టీని వీడుతారా..?

భూపేశ్‌ బఘేల్‌ సీఎం బాధ్యతలు తనకు అప్పగించి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారనే నమ్మకం ఉందని టీఎస్‌ సింగ్‌ డియో తన సన్నిహితులతో పేర్కొంటున్నారు. ఒకవేళ ఆయనకు సీఎం పదవి ఇవ్వకుంటే టీఎస్‌ సింగ్‌ డియో కాంగ్రెస్‌ పార్టీని వీడుతారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. వేరే పార్టీలో మాత్రం చేరే ఉద్దేశం లేనప్పటికీ.. ఎట్టిపరిస్థితుల్లోనూ బఘేల్‌ నాయకత్వంలో పనిచేసేది లేదని నిర్ణయించుకున్నట్లు డియో సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ఇదే సమయంలో బఘేల్‌ రాజీనామా చేస్తారని.. రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు కుట్ర పన్నుతున్నారనే కోణంలో ఓ వెబ్‌సైట్‌లో వార్త రావడం కలకలం రేపింది. ఆ వార్తలను ఖండించిన డియో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు నాయకత్వ మార్పుపై సీఎం భూపేశ్‌ను ఎవరు అడిగినా.. అధిష్ఠానం ఆదేశిస్తే సీఎం బాధ్యతల నుంచి తప్పుకుంటానని పేర్కొంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠంపై ఇరువురు నాయకులు దిల్లీ చేరుకోవడంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఛత్తీస్‌గఢ్‌ సంక్షోభంపై ఏం నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని