గెజిట్‌పై రాజకీయాలు చేయడం తగదు: జీవీఎల్‌

తాజా వార్తలు

Published : 18/07/2021 01:28 IST

గెజిట్‌పై రాజకీయాలు చేయడం తగదు: జీవీఎల్‌

గుంటూరు: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జలశక్తి శాఖ గెజిట్‌ విడుదల చేయడంతో ఆయా నదులపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళతాయనే ప్రచారం సరికాదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నదీ బోర్డుల విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్ర పరిధిలో ప్రాజెక్టులను ఆయా రాష్ట్రాలే నిర్వహించుకుంటాయని స్పష్టం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్‌ జారీ చేసిందని వివరించారు.

జల వివాదాలు పెద్దవి కాకుండా కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుందని అభిప్రాయపడ్డారు. తెరాస నేతలు దీన్ని కూడా రాజకీయం చేయడం తగదన్నారు. వివాదాలు పెంచి రాజకీయ లబ్ధి కోసం తెరాసతో పాటు వైకాపా, తెదేపా కూడా యత్నించాయని ఆరోపించారు. జగనన్న కాలనీల్లో  ప్రచార ఆర్భాటమే కనిపిస్తోందని విమర్శించారు. జగనన్న కాలనీలకు కేంద్రం నిధులు ఇవ్వాలనడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. కేంద్రం నిధులతో కట్టిన టిడ్కో ఇళ్లను ఇంకా పేదలకు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. టిడ్కో ఇళ్ల వద్ద మౌలిక వసతులపై కేంద్ర మంత్రితో మాట్లాడతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, ఇతర సమస్యలపై చర్చించేందుకు సోమవారం భాజపా ముఖ్యనేతల సమావేశం విజయవాడలో నిర్వహించనున్నట్టు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని