KTR Vs Revanth: రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ పరువునష్టం దావా

తాజా వార్తలు

Updated : 20/09/2021 21:18 IST

KTR Vs Revanth: రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ పరువునష్టం దావా

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. మాదకద్రవ్యాల కేసుతో ముడిపెడుతూ రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారని పిటిషన్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలను పరువునష్టం చర్యలుగా పరిగణించి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పేలా రేవంత్ రెడ్డిని ఆదేశించాలని సిటీ సివిల్ కోర్టును కేటీఆర్ కోరారు. పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలన్నారు. తన పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను ట్విటర్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా రేవంత్‌ను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈడీ డ్రగ్స్ కేసుతో ముడిపెడుతూ తనపై తప్పుడు, పరువునష్టం వ్యాఖ్యలు చేయకుండా రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులను నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

రేవంత్ రెడ్డి నుంచి పరువునష్టం పరిహారం కోరేందుకు అవసరమైన మరిన్ని వివరాలను సేకరిస్తున్నాని.. దానిపై తగిన సమయంలో కోర్టును కోరతానని పిటిషన్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. ఈడీ డ్రగ్స్ కేసుతో తనకెలాంటి సంబంధం లేకపోయినా దురుద్దేశపూర్వకంగా లాగుతూ తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. మంత్రిగా, తెరాస నేతగా తనకు రాష్ట్రంతో పాటు దేశ, విదేశాల్లో పేరు, ప్రతిష్టలున్నాయన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేస్తూ తన ప్రతిష్ట దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. క్రిమినల్ కేసులను రాజకీయ ప్రత్యర్థుల పరువు, ప్రతిష్టను దెబ్బతీసేందుకు వాడుకోరాదన్నారు. తనకు ఏ దర్యాప్తు సంస్థ నుంచి నోటీసులు రాలేదని.. అయినప్పటికీ రేవంత్ రెడ్డి దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ప్రస్తుతం సిటీ సివిల్‌ కోర్టు కార్యాలయం పరిశీలనలో ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని