Ts News: ఆ కేసులతో రేవంత్‌ను ఏమీ చేయలేరు: నాగం జనార్థన్‌రెడ్డి

తాజా వార్తలు

Published : 15/10/2021 01:05 IST

Ts News: ఆ కేసులతో రేవంత్‌ను ఏమీ చేయలేరు: నాగం జనార్థన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన ప్రాజెక్టుల గురించి సమగ్రంగా తెలుసుకోవాల్సి ఉందని మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో నాగం మీడియాతో మాట్లాడుతూ...  మహబూబ్‌నగర్‌ జంగ్‌ సైరన్‌ సభపై తెరాస నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ భరతం పట్టేందుకే రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని, ఆయనపై అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు. రేవంత్‌పై ఉన్న కేసులతో జైల్లో పెడతామని తెరాస నేతలు చెబుతున్నారన్న ఆయన.. రేవంత్‌పై ఉన్న కేసుల్లో ఆయన్ను జైల్లో పెట్టడం సాధ్యం కాదన్నారు. అవన్నీ ఎన్నికల సంఘం పరిధిలోనివని స్పష్టం చేశారు. కేసీఆర్‌.. సీఎం హోదాలో తిరుపతి వెళ్లిన సమయంలో రాయలసీమను రతనాల సీమగా చేస్తానన్నప్పుడు పాలమూరు జిల్లా తెరాస నేతల నోళ్లు ఎందుకు మూగబోయాయని ప్రశ్నించారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలోనే పాలమూరు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు మొదలయ్యాయన్న జనార్థన్‌రెడ్డి.. కాంగ్రెస్‌ హయాంలో పెట్టిన మోటార్లను కేసీఆర్‌ సర్కార్‌ కిందకు దింపి నాలుగు బోల్టులు బిగించి కొబ్బరికాయలు కొడుతున్నారని ఆరోపించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ కాంగ్రెస్‌ హయాంలో చేపట్టినవేనని వివరించారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేస్తే నల్గొండ జిల్లాలోని చాలా ప్రాంతాలకు నీళ్లు వచ్చేవన్నారు. ప్రాజెక్టు పంప్‌ మోటార్ల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. నిరూపించలేకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని లేకపోతే నిరంజన్‌రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని నిలదీశారు. ఈ అంశంపై ఎవరు చర్చకు వస్తారని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.ఏపీ నిబంధనలకు విరుద్ధంగా 300 టీఎంసీల నీటిని తీసుకెళ్తోందని ధ్వజమెత్తారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని