Nara Lokesh: ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది.. జగన్‌కు లోకేశ్‌ లేఖ

తాజా వార్తలు

Updated : 19/08/2021 15:43 IST

Nara Lokesh: ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది.. జగన్‌కు లోకేశ్‌ లేఖ

అమరావతి: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేట్ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లోకేశ్‌ లేఖ రాశారు. రెండు దశల్లో కొవిడ్ మిగిల్చిన నష్టం కారణంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం రోజే కోయిల్‌కుంట్లలో ఒక ప్రైవేట్ పాఠశాల నడుపుతున్న దంపతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. పాఠశాల నిర్వహణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలు, ఉపాధ్యాయుల పట్ల ముందుగానే సరైన చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదని లోకేశ్‌ అభిప్రాయపడ్డారు.

‘‘ఏపీలో దాదాపు 12వేల కంటే ఎక్కువ ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో 1.25 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. మార్చి 2020లో లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి వేలాది మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు సక్రమంగా జీతాలు లేవు. గత ఐదు నెలల్లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే దాదాపు 5 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి. కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు కూరగాయలు విక్రయించడం, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలుగా మారడం చూస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కొంత మంది  ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారు. భారతీయ సంస్కృతి, సమాజ విలువలను తీర్చిదిద్దే గురువుల గురించి ఎన్నో ప్రసంగాలు ఇచ్చిన సీఎం జగన్‌ ప్రైవేటు ఉపాధ్యాయులు,  సిబ్బందికి తక్షణ సహాయం అందించడం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఇప్పటికే పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలతో పాటు ఇతర రాష్ట్రాలు తోచిన సాయం అందించాయి. ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవనోపాధికి తగిన భద్రత ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలి’’ అని లోకేశ్‌ లేఖలో పేర్కొన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని