Ap News: సినీ పరిశ్రమ గురించి పవన్‌ నిజాలు తెలుసుకోవాలి: పేర్ని నాని

తాజా వార్తలు

Updated : 26/09/2021 18:00 IST

Ap News: సినీ పరిశ్రమ గురించి పవన్‌ నిజాలు తెలుసుకోవాలి: పేర్ని నాని

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెడుతోందన్న పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలపై  మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్‌పై ద్వేషంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ఆన్‌లైన్‌ టికెట్ల అమ్మకాలపై సినీ పెద్దల వినతిని ఆమోదిస్తే ప్రభుత్వంపై విషం చిమ్మడమేంటని ప్రశ్నించారు. సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అందుకు తాజాగా విడుదలైన లవ్‌స్టోరీ సినామనే ఉదాహరణగా పేర్కొన్నారు. సినీ పరిశ్రమ గురించి పవన్‌ కల్యాణ్‌ నిజాలు తెలుసుకోవాలని పేర్ని నాని అన్నారు. ‘‘తెలంగాణలో 519 థియేటర్లుకు గాను 419 థియేటర్లు మాత్రమే తెరిచారు. ఏపీలో 1100 థియేటర్లలో 800 థియేటర్లు నడస్తున్నాయి. ఏపీలో 3రోజులుగా 510 థియేటర్లలో లవ్‌ స్టోరీ సినిమా ఆడుతోంది. ఈ సినిమాకు తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ కలెక్షన్స్‌ వచ్చాయి. నిర్మాతలకు తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ షేర్‌ వస్తోంది.  పవన్‌ మాటలు జగన్‌ మీద విషం చిమ్మే ప్రయత్నమని లవ్‌స్టోరి చిత్ర నిర్మాత నారంగ్‌ చెప్పాలి. యుద్ధవీరుడు, పోరాట యోధుడు పీకే వాస్తవాలు గ్రహించాలి. జగన్‌ మోహన్‌రెడ్డి సినీ పరిశ్రమను ఏం ఇబ్బంది పెట్టారో చెప్పాలి. జగన్‌పై విషం చిమ్మేందుకే పవన్‌ అవాకులు, చెవాకులు పేలారు’’ అని పేర్ని నాని విమర్శించారు.

దమ్ముంటే కేంద్రాన్ని, అమిత్‌షాను నిలదీయాలి

‘‘సాయిధరమ్‌తేజ్‌ రోడ్డు ప్రమాదంపై మీడియా చేసిన తప్పేంటి? తెలంగాణ పోలీసులు చెప్పిందే మీడియా రాసింది. పీకేకు దమ్ముంటే తెలంగాణ పోలీసులను, కేసీఆర్‌ను తిట్టాలి. నా అభిమానుల సంఘం అధ్యక్షుడు పీకే. పవన్‌ కల్యాణ్ మనసు నిండా నేనే ఉన్నా.  నేను బందరులో గెలిచా.. పీకే రెండు చోట్ల పోటీచేసి ఓడారు. ‘మా’ ఎన్నికల్లో ఓట్ల కోసం పీకే అనేక తిప్పలు పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో వకీల్‌సాబ్‌ సినిమాకు దిల్‌రాజు షేర్‌ రూ.80కోట్లు. ఏపీలో రూ.55 కోట్లు, తెలంగాణలో రూ.25 కోట్లు వచ్చాయి. కోడికత్తి కేసును ఎన్ఐఏ చూస్తోంది... దమ్ముంటే దీనిపై కేంద్రాన్ని, అమిత్‌షాను నిలదీయాలి. జీఎస్టీ, ఆదాయపన్ను వసూళ్లపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. పవన్‌ కల్యాణ్‌ సినిమాలతో వచ్చే ఆదాయంతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందా? ఆన్‌లైన్‌ టికెటింగ్‌ కోసం 2003 నుంచి సినిమా ఇండస్ట్రీ అంతా చంద్రబాబు సహా వైఎస్‌ఆర్‌ను కలిసి కోరుతోంది. 2020 జూన్‌లో సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి సహా సినీ ప్రముఖులు  ఆన్‌లైన్‌ టికెటింగ్‌ పెట్టాలని కోరారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవహారంతో పవన్‌ కల్యాణ్ కు ఏంసంబంధం. ఆన్‌లైన్‌ చేస్తే బ్లాక్‌ మార్కెటింగ్‌, పన్ను ఎగవేతలు తగ్గుతాయని, పారదర్శకత వస్తుందని  సినీ ప్రముఖులు చెప్పారు. ఆన్‌లైన్‌ అమ్మకాల కోసం ప్రభుత్వం పోర్టల్‌ ను మాత్రమే నడుపుతుంది. టికెట్లను థియేటర్‌ యాజమాన్యాలే అమ్ముకుంటాయి. వసూలైన డబ్బును మరుసటి రోజే నిబంధనల ప్రకారం ఎవరి డబ్బు వారికి పంపిణీ అవుతుంది. బ్లాక్‌ టికెట్లు అమ్మి నిర్మాతల ద్వారా నల్లధనం వసూళ్లు తెచ్చి తనకు కట్టాలని పవన్‌ కల్యాణ్‌ కోరుకుంటున్నారా?. 2013 నాటి రేట్ల కంటే 40 శాతం టికెట్ల ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్న తెలుగుదేశం పార్టీని పవన్‌ కల్యాణ్‌ ఎందుకు నిలదీయడంలేదు. ఇడుపుల పాయలో నేలమాళిగల్లో జగన్‌కు డబ్బుంటే మోదీ, అమిత్‌ షా వద్దకు వెళ్లి విచారణ జరిపించాలి’’ అని పేర్ని నాని అన్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని