లారీలు అడ్డుపెట్టి దేవినేని ఉమా కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు

తాజా వార్తలు

Published : 05/08/2021 16:54 IST

లారీలు అడ్డుపెట్టి దేవినేని ఉమా కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు

భీమడోలు: రాజమహేంద్రవరం జైలు నుంచి  మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఇవాళ విడుదలయ్యారు. ఈ సందర్భంగా తెదేపా శ్రేణులు ఉమాకు ఘనస్వాగతం పలికారు. రాజమహేంద్రవరం నుంచి ఉమా వెంట తెదేపా శ్రేణులు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సమీపంలోకి రాగానే  ఉమా కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రహదారికి అడ్డంగా లారీలు, ట్రక్కులు పెట్టి  తెదేపా నేతలు, కార్యకర్తలు ప్రయాణిస్తున్న వాహనాలను రోడ్డుపైనే నిలిపివేశారు. దేవినేని ఉమా ప్రయాణిస్తున్న ఒక్క కారును పంపి, వాహనశ్రేణిలోని మిగిలిన కార్లను పంపకపోవడంతో దేవినేని ఉమా, పట్టాభి ఇతర నేతలు అక్కడే నిరసనకు దిగారు. దీంతో భీమడోలులో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. భీమడోలు రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

కృష్ణా జిల్లా కొండపల్లిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జి.కొండూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ దేవినేని ఉమ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్‌ ఇచ్చిన నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలు నుంచి దేవినేని ఉమ విడుదలయ్యారు. ఆయన విడుదల సందర్భంగా జైలు వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఉమ మీడియాతో మాట్లాడారు.  ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా న్యాయదేవత అనుగ్రహంతో విడుదలయ్యానని చెప్పారు. అక్రమ నిర్బంధాలతో తమ పోరాటం ఆగదన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని