Huzurabad ByElection: హోరా హోరీ పోరు.. ప్రచారానికి మరో 10 రోజులే గడువు!

తాజా వార్తలు

Published : 17/10/2021 21:36 IST

Huzurabad ByElection: హోరా హోరీ పోరు.. ప్రచారానికి మరో 10 రోజులే గడువు!

హుజూరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి మరో 10 రోజులే గడువు ఉంది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ రావడంతో 3 రోజులుగా ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఐదు నెలలుగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే‌, తెరాస నేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై నియోజకవర్గాన్ని హీటెక్కించారు. పండగ అనంతరం మండలాల వారీగా ఆయా పార్టీల ఇన్‌ఛార్జ్‌లు ప్రచార వేగాన్ని పెంచారు. పొలింగ్‌కు మరో 13 రోజులే గడువు ఉండటం, 72 గంటల ముందే స్థానికేతరులు నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం సూచిస్తుండటంతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అన్ని పార్టీల నేతలు వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు స్థానిక నేతలైన ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్, బీసీ కమిషన్ ఛైర్మన్ కృష్ణ మోహన్ రావు, ఇతర స్థానిక తెరాస ప్రజాప్రతినిధులు తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌కు అండగా ఉండనున్నారు.

అధికార పార్టీకి చెందిన మంత్రి తన్నీరు హరీశ్‌రావు గత నెల రోజులుగా నియోజకవర్గంలోనే ఉంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 18 ఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగిన భాజపా అభ్యర్థి ఈటల రాజెందర్‌ అన్నీ తానై జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ స్థానికేతరుడు కావడం, ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఇతర పార్టీల్లో చేరిపోవడం కొంత మేర ఆ పార్టీకి నష్టంగానే భావించాలి. 5 నెలల నుంచి నియోజకవర్గంలో మకాం వేసిన తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన స్టార్‌ క్యాంపెయినర్స్‌ ఈ నెల 27న సాయంత్రం హుజూరాబాద్ నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళక తప్పదు. ఆ తర్వాత స్థానిక నాయకులు పోల్ మేనేజ్‌మెంట్ వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.

ఉపఎన్నికకు సీపీఐ దూరం...

హుజూరాబాద్ ఉప ఎన్నికకు సీపీఐ దూరంగా ఉంటోంది. దానికి కారణాలు వివరిస్తూ ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజల ఇష్టాలను ప్రతిబింబించాలి. కానీ, అవి రోజు రోజుకూ అధికారం, డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలకు లోనవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న హుజూరాబాద్ ఉపఎన్నికలు వాటిని తలదన్నే రీతిలో ఉన్నాయి. ఇప్పటికే కోట్లాది రూపాయల నగదు, రూ.లక్షలు విలువైన మద్యం, బంగారం, వెండి వస్తువులు, చీరెలు, దుస్తులు నిఘా బృందాలకు పట్టుబడినట్లు వార్తలు వెలువడ్డాయి. అందులో గంజాయి కూడా ఉండటం విస్మయానికి గురి చేసింది. ఈ ఉపఎన్నికలో రాజకీయాలు, విధానాలకన్నా వ్యక్తిగత దూషణలు, ద్వేషం, కక్ష ప్రధానమైన తీరు కనిపిస్తోంది. అందుకే ఎన్నికల ప్రక్రియ తీరుకు దూరంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది’’ అని ప్రకటన విడుదల చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని