భూ బాగోతం బయటపెడతా: రేవంత్‌

తాజా వార్తలు

Updated : 16/07/2021 20:01 IST

భూ బాగోతం బయటపెడతా: రేవంత్‌

హైదరాబాద్‌: కోకాపేట భూముల వేలం ద్వారా రూ.వెయ్యి కోట్ల దోపిడీ జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ భూ బాగోతం వెనక తెరాస నేతలే ఉన్నారన్నారు. ఇంత పెద్ద మొత్తంలో దోపిడీ ఎలా చేశారు? అందుకు సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా రేపు బయటపెడతానని రేవంత్‌ ప్రకటించారు. ఎకరా రూ.60 కోట్లు పలకాల్సిన భూమి కేవలం రూ.30 కోట్లకే దోచేశారని తెలిపారు. టెండర్లు వేయకుండా కొంత మందిని మేనేజ్‌ చేశారని.. కేసీఆర్‌ తన బినామీలు, పార్టీ వారి కోసమే మేనేజ్‌ చేశారని ఆరోపించారు. రూ.3వేల కోట్ల ఆదాయం రావాల్సిన చోట రూ.2వేల కోట్లే వచ్చాయన్నారు. వేలంలో పాల్గొన్న కంపెనీలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ లావాదేవీలనూ బయటపెడతానని రేవంత్‌ వెల్లడించారు. రిటైరైన కేసీఆర్ బంధువులు కొందరు విదేశీ పాస్‌పోర్టులు తెచ్చుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో దోచుకుని విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడకపోతే విదేశాలకు పారిపోయేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. అలాంటివారి వివరాలనూ బయటపెడతామన్నారు. విదేశీ పాస్‌పోర్టులు తీసుకున్న బంధువుల లెక్కను సీఎం చెప్పాలని రేవంత్‌ డిమాండ్ చేశారు.

‘‘ఐజీ ప్రభాకర్‌రావు అన్ని పార్టీల నేతల ఫోన్లు ట్యాప్‌ చేయిస్తున్నారు. ఇజ్రాయెల్‌ సాంకేతికత తెప్పించి మరీ హ్యాక్‌ చేయిస్తున్నారు. తీవ్రవాదుల జాడ కోసం తెచ్చిన సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. ఐజీ ప్రభాకర్‌రావు ప్రైవేటు సైన్యాన్ని నడిపిస్తూ దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. కేసీఆర్‌ బంధువులైన ఎస్పీలు నర్సింగరావు, రాఘవేంద్రరావు ఐజీకి సహకరిస్తున్నారు. రిటైరైన కేసీఆర్‌ బంధువులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు’’ అని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని