JC Prabhakar Reddy: జేసీ సార్‌.. సమావేశం ఏర్పాటు చేస్తాం రండి

తాజా వార్తలు

Updated : 03/08/2021 13:02 IST

JC Prabhakar Reddy: జేసీ సార్‌.. సమావేశం ఏర్పాటు చేస్తాం రండి

ఆహ్వానించిన తాడిపత్రి మున్సిపల్ కమిషనర్‌
ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభాకర్‌రెడ్డి

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని మున్సిపల్‌ కమిషనర్‌ నర్సింహప్రసాద్‌ కలిశారు. సోమవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో జేసీని కమిషనర్‌ కలిశారు. మంగళవారం అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని.. ఆ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ హోదాలో  సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి అధికారులు గైర్హాజరై ఈరోజు రావాలని ఆహ్వానించడంపై జేసీ మండిపడ్డారు. మున్సిపల్‌ సిబ్బంది వైఖరి పట్ల జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసన తెలుపుతూ సోమవారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలో నిద్రించారు. ఈ ఉదయం కార్యాలయం ఆవరణలోనే కాలకృత్యాలు తీర్చుకున్నారు. జేసీ నిరసన నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఈరోజు ఆయన్ను కలిసి సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

అసలేం జరిగిందంటే..

మున్సిపల్‌ ఛైర్మన్‌ హోదాలో అధికారులు, సిబ్బందితో సోమవారం ఉదయం 10.30 గంటలకు సమీక్షా సమావేశం ఉంటుందని కమిషనర్‌తో సహా అందరికీ శనివారమే జేసీ ప్రభాకర్‌రెడ్డి సమాచారం ఇచ్చారు. అదే సమయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్‌ సిబ్బందితో కలిసి కరోనా వైరస్‌ మూడో దశపై అవగాహన ర్యాలీ, సమీక్షా సమావేశం నిర్వహించడంతో అధికారులకు సందిగ్ధ పరిస్థితి ఎదురైంది. ర్యాలీ అనంతరం కార్యాలయానికి వస్తారనే ఉద్దేశంతో 12.30 గంటలకు ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్లతో కలిసి కమిషనర్‌ ఛాంబర్‌లో ఎదురు చూస్తూ కూర్చున్నారు. మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యేతో సమీక్ష ముగిసిన అనంతరం అటు నుంచి అటే ఇళ్లకు వెళ్లిపోవడం, కమిషనర్‌ నరసింహప్రసాద్‌ మధ్యాహ్నం నుంచి సెలవుపై వెళుతూ ఇతరులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలియడంతో ఛైర్మన్‌ జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కార్యాలయానికి వచ్చే వరకు కదిలేది లేదంటూ కార్యాలయంలోనే భీష్మించుకు కూర్చున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కొందరు అధికారులు రాగానే వారి నిబద్ధతను మెచ్చుకుంటున్నట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రదర్శించిన హావాభావాలకు అధికారులు సమాధానం చెప్పలేని స్థితిలో పడిపోయారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కమిషనర్‌ సెలవుపై ఎలా వెళతారని, ఛైర్మన్‌ ఆదేశాలను కాదని సిబ్బంది ఎలా గైర్హాజరవుతారని ప్రశ్నిస్తూ 26 మందికి తాఖీదులు జారీ చేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. కమిషనర్‌ వచ్చేదాకా రాత్రి కూడా కార్యాలయంలోనే బస ఏర్పాటు చేసుకుంటామని ఛైర్మన్‌ పేర్కొనడంతో పరిస్థితి రసవత్తరంగా మారింది. ఆ మేరకు ఆయన రాత్రి అక్కడే భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని