Rahul Gandhi: ట్విటర్‌ మనకు రాజకీయాలు నేర్పుతోందా?

తాజా వార్తలు

Updated : 13/08/2021 12:38 IST

Rahul Gandhi: ట్విటర్‌ మనకు రాజకీయాలు నేర్పుతోందా?

పక్షపాతం చూపిస్తోందంటూ రాహుల్‌ గాంధీ ధ్వజం

దిల్లీ: సోషల్‌మీడియా సంస్థ ట్విటర్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ సంస్థ పక్షపాతంగా వ్యవహరిస్తోందని, తన ఖాతాను నిలిపివేసి దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందని దుయ్యబట్టారు. మనకు రాజకీయాలు నేర్పాలని చూస్తోందని ధ్వజమెత్తారు.

దిల్లీలో హత్యాచారానికి గురైన ఒక దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఆ చిత్రాలను పంచుకున్నందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఖాతాను ట్విటర్‌ ఇటీవల తాత్కాలికంగా స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారిక ఖాతాతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలకు చెందిన దాదాపు 5వేల ఖాతాలను ట్విటర్‌ నిలిపివేసింది. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన రాహుల్‌.. శుక్రవారం తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

‘‘ట్విటర్‌ ఓ తటస్థ సామాజిక మాధ్యమ వేదిక కాదని ఇప్పుడు స్పష్టమవుతోంది. ఇది ఓ పక్షపాత వేదిక. ప్రభుత్వం ఏం చెబితే అది వింటోంది. నా ట్విటర్‌ ఖాతాను స్తంభించి మన రాజకీయ విధానాల్లో జోక్యం చేసుకుంటోంది. మనకు రాజకీయాలను నేర్పేందుకు చూస్తోంది. ఒక రాజకీయ నాయకుడిగా దీన్ని నేను అంగీకరించలేను. ఇది కేవలం రాహుల్‌ గాంధీ మీద జరిగిన దాడి కాదు.. మన ప్రజాస్వామ్య వ్యవస్థ మీద జరుగుతున్న దాడి. నా ఖాతాను నిలిపివేయడం అంటే కేవలం రాహుల్‌గాంధీని అడ్డుకోవడం కాదు. నాకు 19-20 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వారి హక్కులను కూడా అడ్డుకున్నట్లే’’ అని రాహుల్‌ దుయ్యబట్టారు.

‘‘ఒక భారతీయుడిగా నేను అడిగే ప్రశ్న ఒక్కటే.. ప్రభుత్వానికి విధేయంగా ఉంటున్నాయని కంపెనీలు మనకు రాజకీయాలు నేర్పడాన్ని అంగీకరిద్దామా? లేదా మన రాజకీయాలను మనమే నిర్వచించుకుందామా? మన ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోంది. పార్లమెంట్‌లో మాట్లాడనివ్వట్లేదు. మీడియాను నియంత్రిస్తున్నారు. ఇప్పుడు మా అభిప్రాయాలను ట్విటర్‌లో పెడుతుంటే అక్కడా అణగదొక్కాలని చూస్తున్నారు’’ అని కేంద్రంపైనా రాహుల్‌ విమర్శలు గుప్పించారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని