Westbengal: తిరిగి ‘తృణమూల్‌’ గూటికేనా..?
close

తాజా వార్తలు

Updated : 10/06/2021 21:59 IST

Westbengal: తిరిగి ‘తృణమూల్‌’ గూటికేనా..?

వెనక్కి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న పలువురు నేతలు

దిల్లీ: ఎన్నికలకు ముందు పశ్చిమ్‌బెంగాల్‌ రాజకీయాల్లో వరుస సంచలనాలు. సువేందు అధికారి సహా చాలా మంది కీలక నేతలు అధికార తృణమూల్‌ పార్టీని వీడారు. అయినా  అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఏ మాత్రం వెరవలేదు. మొత్తం 294 స్థానాలకుగానూ 211 చోట్ల గెలుపొంది.. తృణమూల్‌ అఖండ విజయం సాధించింది. దీంతో గతంలో పార్టీని వీడిన చాలా మంది నేతలు తిరిగి అదే గూటికి చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు దీదీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

అన్నింటికంటే ముఖ్యంగా భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌ తిరిగి తృణమూల్‌లో చేరుతారనే ఊహాగానాలు ఇటీవల ఎక్కువయ్యాయి. వీటిని వ్యతిరేకిస్తూ ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇటీవల కోల్‌కతాలో తుపాను తీవ్రతపై ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరు కాకపోవడంతో ముకుల్‌ తిరిగి తృణమూల్‌ చేరడం దాదాపు ఖాయమైయిందని అందరూ భావించారు. తాజాగా తృణమూల్‌ కీలక నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. గతంలో పార్టీ నుంచి వెళ్లిన చాలా మంది తిరిగి తృణమూల్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, దీని కోసం అభిషేక్‌ బెనర్జీతో చర్చలు జరుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తుదినిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి మమతా బెనర్జీదేనని అన్నారు. 

మరోవైపు పార్టీని విడిచి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కష్టకాలంలో పార్టీని వదలివెళ్లి, అంతా సవ్యంగా ఉన్నప్పుడు తిరిగి చేరడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పార్టీని నమ్ముకొని ఉన్న వారికి అన్యాయం జరుగుతుందని అంటున్నారు. అంతేకాకుండా బయటకు వెళ్లి వచ్చిన వారిని రెండు భాగాలుగా విభజించాలని మరికొందరు తృణమూల్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీని వీడిన తర్వాత అధినేత్రి మమతపై విమర్శలు గుప్పించిన వారిని ఒక వర్గం (హార్డ్‌లైనర్స్‌)గా, పార్టీని విడిచినా దీదీనిగానీ, పార్టీనిగానీ హేళన చేయనివారిని మరో వర్గం (సాఫ్ట్‌ లైనర్స్‌)గా గుర్తించాలని అంటున్నారు. సువేందు అధికారి లాంటి నేతలు హార్డ్‌లైనర్స్‌ కిందికి రాగా, ముకుల్‌ రాయ్‌ లాంటి నేతలను సాఫ్ట్‌లైనర్స్‌గా గుర్తించాలని అంటున్నారు.

రాజకీయ పొరపొచ్చాలు

మమతా బెనర్జీకి ముకుల్‌ రాయ్ అత్యంత ఆప్తుడు. పార్టీ ప్రారంభం నుంచి కీలకంగా పని చేశారు. అయితే 2017లో వీరిద్దరి మధ్య రాజకీయపరమైన విభేదాలు వచ్చాయి. పార్టీ అనుమతి లేకుండా అరుణ్‌ జైట్లీ, అమిత్‌షా లాంటి భాజపా కీలక నేతలను కలిశారన్న కారణంతో తృణమూల్‌ నుంచి రాయ్‌ను బహిష్కరించారు. ఆ తర్వాత ఆయన భాజపాలో చేరి, జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే భాజపాలో ఓ కీలక స్థానంలో ఉన్న వ్యక్తి తిరిగి తృణమూల్‌లో చేరుతారనడంపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

35 మంది రెడీ!

కరోనాతో చికిత్స పొందుతున్న రాయ్‌ సతీమణిని పరామర్శించేందుకు అభిషేక్‌ బెనర్జీ ఆస్పత్రికి వెళ్లడం, కోల్‌కతా సమావేశంతోపాటు ఇటీవల ఏర్పాటు చేసిన పలు పార్టీ కార్యక్రమాలకు రాయ్‌ దూరంగా ఉండటం తదితర అంశాలను పరిశీలిస్తే తిరిగి ఆయన తృణమూల్‌ గూటికి రావడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. అయితే దీనిపై అధికారికమైన సమాచారమేదీ లేదు. మరోవైపు భాజపా అధిష్ఠానం కూడా రాయ్‌ కదలికలపై ఓ కన్నేసినట్లు సమాచారం. సువేందు అధికారితో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకున్నట్లు  తెలుస్తోంది. మరోవైపు సువేందు అయినా పార్టీలో కొనసాగుతారా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. తృణమూల్‌ నుంచి వెళ్లిన వారిలో దాదాపు 35 మంది నేతలు తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే వీరంతా ఎప్పుడు చేరతారన్నదానిపై స్పషత రావాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని