TS News: పెట్రోల్‌ ధరలపై కాంగ్రెస్‌ నిరసనలు
close

తాజా వార్తలు

Updated : 11/06/2021 15:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: పెట్రోల్‌ ధరలపై కాంగ్రెస్‌ నిరసనలు

బంకుల వద్ద నిరసన తెలిపిన శ్రేణులు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించాలన్న ఉత్తమ్‌

హైదరాబాద్‌: కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాల కారణంగా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100కు చేరిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ ఏడాదిలోనే పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.24 పెరిగిందని చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలంటూ ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలకు దిగింది. నేతలు, కార్యకర్తలు పెట్రోల్‌ బంకుల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద చేపట్టిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు నేతలు పొన్నాల లక్ష్మయ్య, అంజన్‌కుమార్‌ యాదవ్‌, దాసోజు శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడారు.

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే ఇక్కడ మాత్రం ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌లను భారీగా పెంచారని విమర్శించారు. చమురు ధరలపై రాష్ట్ర పన్నును తెరాస ప్రభుత్వం వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గ్యాస్‌ ధరలతోనూ దోపీడీ చేస్తున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. 2014లో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.400 ఉంటే.. ఇప్పుడు అది రూ.860 పెరిగిందన్నారు. దీన్ని బట్టి ఏ మేర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయో అర్థమవుతోందని చెప్పారు. సామాన్య ప్రజానీకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెనుభారం మోపుతున్నాయని..  పెట్రోలు, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని నేతలు డిమాండ్‌ చేశారు.

పేదలు బతికే పరిస్థితులు లేవు : రేవంత్‌ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి పేదల పక్షాన లేకపోవడం వల్ల ఆ కుటుంబాల బతుకులు రోడ్డున పడ్డాయని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ‘‘కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితులు లేకుండా పోయాయి. కనీసం కుటుంబానికి రూ.6 వేలు, ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలి. ఒకే దేశం - ఒకే విధానమైనప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ సమాధానం చెప్పాలి’’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని