TS News: ఈటలా.. ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదు?

తాజా వార్తలు

Updated : 04/06/2021 13:26 IST

TS News: ఈటలా.. ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదు?

గౌరవం ఆత్మ మీదా? ఆస్తుల మీదా?
నిలదీసిన తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతోమందిని సీఎం కేసీఆర్‌ నాయకులుగా తయారు చేశారని తెరాస ముఖ్యనేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ వల్లే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ విమర్శల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో పల్లా మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది పార్టీని వీడుతూ ఆరోపణలు చేశారని.. ఈటల కూడా అదే చేశారన్నారు. తెరాస నుంచి బయటకు వెళ్లినవారి పరిస్థితేంటో అందరికీ తెలుసని చెప్పారు. ఈటలకు పార్టీలో కేసీఆర్‌ సముచిత గౌరవం ఇచ్చారన్నారు. 2009లో తెరాస శాసనసభాపక్ష నేతగా.. తెరాస ప్రభుత్వంలో ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశం కల్పించారని చెప్పారు. అంతకుముందు జిల్లా స్థాయిలో కీలక పదవులు కట్టబెట్టారని గుర్తు చేశారు. కేసీఆర్‌ తర్వాత పార్టీ, ప్రభుత్వంలో అన్ని ముఖ్య పదవులను ఈటల పొందారన్నారు. 

2016లో ఓసారి ప్రగతిభవన్‌లోకి రానివ్వలేదని ఆరోపిస్తున్న ఈటల.. ఆత్మగౌరవానికి భంగం, అవమానం అని భావిస్తే ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదని పల్లా ప్రశ్నించారు. చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి ఆత్మగౌరవం పేరుతో ఈటల వస్తున్నారని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలపై ప్రేమ ఉంటే వారి భూమి, చట్ట వ్యతిరేకమైన దేవాదాయ భూమిని ఎలా కొనుగోలు చేశారని నిలదీశారు. గౌరవం ఆస్తుల మీదా? ఆత్మ మీదా? అని దుయ్యబట్టారు. ఈటల తన ఆస్తులను రక్షించుకోవడానికి ప్రేమే తప్ప ఆత్మ మీద గౌరవం కాదని ఎద్దేవా చేశారు. 6 నెలలుగా రైతులు చేస్తున్న పోరాటాన్ని తొక్కి పెట్టి వాళ్లను హింసిస్తున్న భాజపాలో ఎలా చేరుతున్నారని ఈటలను పల్లా ప్రశ్నించారు. కేసీఆర్‌పై అనవసరంగా నోరు పారేసుకుంటే సూర్యుడిపై ఉమ్మి వేసినట్టేనన్నారు. హుజురాబాద్‌ ప్రజలు ఈటల వెంట లేరని.. ఆయన వెనుక కొద్ది మంది అసంతృప్తి వాదులు మాత్రమే ఉన్నారన్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని